Chilli Farmers Problems : అటు ప్రకృతి కరుణించక.. ఇటు పాలకులు పట్టించుకోక... మిరప రైతులకు మొక్క దశ నుంచే కంటిమీద కునుకు కరవైంది. రెండు నెలలుగా సరైన వానల్లేక, కాల్వల్లో నీళ్లు రాక పంట ఎండిపోతుండగా.. నీటి వనరుల నుంచి కొత్తగా పైపులు వేసుకోవడానికి, ట్యాంకర్లకు సాగుదారులు వేలల్లో ఖర్చు చేస్తున్నారు. కొందరు బోర్లు, బావులు తవ్వుతున్నారు. పరిస్థితుల కారణంగా తెగుళ్లు ప్రబలి కొన్నిచోట్ల మిరప తోటల్ని వదిలేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. జగన్ ప్రభుత్వం (Jagan Govt) మాత్రం రైతుల గోడు పట్టించుకోవడం లేదు.
Farmer Crying Due to Dying Crops in AP: నీరందక ఎండిన పంట.. కన్నీరుమున్నీరైన రైతు..
రికార్డు స్థాయిలో సాగు.. విదేశాలకు ఎగుమతులు.. ధరలు ఆశాజనకంగా ఉండటంతో రాష్ట్రంలో మిరప సాగు ఏటా పెరుగుతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 6 లక్షల ఎకరాలకుపైగా మిర్చి పంట రైతులు సాగు చేశారు. గతేడాదితో పోల్చితే 23 వేల ఎకరాల్లో సాగు పెరిగింది. ఎకరా మిరప సాగుకు రెండేళ్ల కిందటి వరకు లక్షన్నర నుంచి లక్షా 75వేల వరకు ఖర్చయ్యేది. నల్లతామర పురుగు తాకిడి రీత్యా రసాయనాల వాడకం పెరిగింది. హైబ్రిడ్ రకాలు వేస్తే ఎకరాకు రెండున్నర లక్షలకు పైగా ఖర్చవుతోంది. ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా గట్టెక్కుతామనే ఆశతో రైతులు పెట్టుబడికి వెనకాడటం లేదు. ఇప్పటికే సాగుదారులు ఎకరాకు 50 వేల నుంచి 60 వేలకు పైగా ఖర్చు పెట్టారు. ఎకరాకు దాదాపు రూ. 40 వేల కౌలు చెల్లించి, 50 వేలకు పైగా పెట్టుబడి పెడితే పంట చేతికి రాకుండానే ఎండుముఖం పడుతోంది.
ఆరుతడి ఇస్తారన్న ఆశతో.. రాష్ట్రంలో 99శాతానికి పైగా రైతులు సాగునీటి ఆధారంగానే మిరప వేస్తారు. వర్షాలు అనుకూలిస్తే అక్టోబరు వరకు నీటి తడులు అక్కర్లేదు. కానీ, ఈ ఏడాది వానల్లేకపోవడంతో... మొక్కలు నాటడం నుంచే నీళ్ల ట్యాంకర్లపై ఆధారపడ్డారు. కాల్వలకు ఆరుతడి ఇస్తారనే ఆశతో పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మిరప సాగు (Chilli Cultivation) చేసిన రైతులు.. ప్రస్తుతం నీరందక అవస్థలు పడుతున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనూ నీరందక పంట ఎండుముఖం పట్టింది. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలోని జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో కాల్వలకు నీరు రాక దూరప్రాంతాల నుంచి ట్యాంకర్లతో తెచ్చి తడులు అందిస్తున్నారు. ఒక్కో తడికి 20 వేలకు పైగా అవుతోంది. ప్రభుత్వం సాగర్ కాల్వ ద్వారా నీరివ్వాలని రైతులు కోరుతున్నారు. అనంతపురం జిల్లా హెచ్‌ఎల్‌సీ పరిధిలో సాగునీటి విడుదలను నవంబరు 10తో నిలిపేస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో... పెట్టుబడులూ దక్కే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు.
మండుతున్న ఎండలు.. నేలలో తేమ లేకపోవడంతోపాటు ఉష్ణోగ్రతల 40 డిగ్రీల వరకు నమోదవుతోంది. దీంతో నేల ఎండిపోయి బీటలు వారుతోంది. మరోవైపు గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కర్నూలు జిల్లాల్లో... జెమిని వైరస్ (Gemini virus) కారణంగా పంట నష్టం వాటిల్లి.. ఎకరాలకు ఎకరాల్లో తోటలు వదిలేస్తున్నారు. ఎండ, తెగులుతో మొక్కలు గిడసబారుతున్నాయి. ఎన్ని మందులు చల్లినా నియంత్రించలేకపోతున్నామని రైతులు చెబుతున్నారు. అధికారులు మాత్రం ఆకుముడత అని కొట్టిపారేస్తున్నారని వాపోతున్నారు. అనంతపురం జిల్లాలోనూ మిర్చి పంటలో తెగుళ్లు పెరిగాయి. కాలర్‌రాట్ తెగులుతో ఆకులు ఎండి, రాలిపోయి మొక్క చనిపోతుండడంతో తోటలు తొలగించడం తప్ప మరో మార్గం కన్పించడం లేదని రైతులు చెప్తున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ, సి.బెళగల్ మండలాలతోపాటు పలుచోట్ల వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది.