గుంటూరులోని ఒక కళాశాలలో గణేష్, సమరసింహారెడ్డి, సుధీర్, ఆనంద్ బీఎస్పీ ఎంఎల్‌టీ (ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు) చదువుతున్నారు. రాజగోపాల్‌నగర్‌లోని ఒక వసతి గృహంలో ఉంటున్నారు. క్రికెట్ ఆడటానికి వెళ్లినప్పుడు అదే ప్రాంతంలో ఉండే వ్యక్తి సుమన్ అనే పేరుతో పరిచయమయ్యాడు. తాను వ్యాయామ చికిత్స నిపుణుడినని (ఫిజియోథెరపిస్టు), ఒక మంత్రి వద్ద పీఏగా పని చేశానని నమ్మించాడు. జగతి పబ్లికేషన్స్ షేర్స్‌లో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో డబ్బులు సంపాదించుకోవచ్చని చెప్పాడు. ఒక్కసారి రూ.10 వేలు కడితే ప్రతి నెల రూ.12 వేలు, రూ.80 వేలు కడితే ప్రతి నెల రూ.లక్ష చొప్పన సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నంతకాలం డబ్బులు ఖాతాలో జమ అవుతాయని నమ్మించాడు.
రూ. 10 వేలు కట్టిన వారికి తొలుత రెండు నెలలు రూ.12 వేలు చొప్పున జమ చేశాడు. రూ. 80 వేలు కడితే బంగారపు వస్తువు బహుమతిగా ఇవ్వడంతో పాటు ప్రతి నెల రూ.లక్ష జమ అవుతుందని నమ్మించాడు. మొత్తం 30 మంది వద్ద రూ.40 లక్షల వరకు కట్టించుకుని పరారయ్యాడు. అతనికి ఫోన్ చేస్తుంటే స్పందించడం లేదని, నిందితుడిపై చర్యలు తీసుకుని డబ్బులు ఇప్పించాలని కోరుతూ గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి:
STUDENTS PROTEST: అనంతలో విద్యార్థులపై విరిగిన లాఠీ.. విద్యాసంస్థల బంద్‌కు పిలుపు