Chandrababu on AP Panchayat By Election Results: రాష్ట్రంలో నేడు జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించడంపై పార్టీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీ ఉప ఎన్నికల్లో గెలిచిన టీడీపీ మద్దతుదారులకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. గతంలో వైసీపీ చేతిలో ఉన్న ఈ స్థానాలను ప్రస్తుతం జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ గెలుచుకోవడం శుభపరిణామమని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వం రోజురోజుకూ ప్రజల మద్దతు కోల్పోతోందన్న చంద్రబాబు.. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు చైతన్యంతో వైసీపీని ఓడించి, టీడీపీని గెలిపిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు. ఈ ఎన్నికల ప్రక్రియలో కూడా కొన్ని చోట్ల పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అక్రమాలకు తెగబడినా.. అన్నింటినీ ఎదిరించి మరీ తెలుగుదేశం అభ్యర్ధులు గెలుపు సాధించారని అన్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం పని చేసిన కార్యకర్తలు, నాయకుల పని తీరును చంద్రబాబు ప్రశంసించారు.
Kinjarapu Atchannaidu Response on Sarpanch By Election Results: రానున్న కురుక్షేత్ర ఎన్నికల సంగ్రామంలో రెట్టింపు ఉత్సాహంతో, మొక్కవోని ధైర్యంతో, ఈ అరాచక పాలనపై పోరాడి తెలుగుదేశం పార్టీ విజయం సాధించి చంద్రబాబుని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం నేడు జరిగిన పంచాయితీ ఉప ఎన్నికల ఫలితాల ద్వారా బట్టబయలైందని అన్నారు.
వైసీపీ నేతల అరాచకం, అధికార గణాన్ని అడ్డుపెట్టుకుని అనేక ప్రతిబంధకాలు సృష్టించినా టీడీపీ అభ్యర్థులు మొక్కవోని ధైర్యంతో పోరాడి విజయం సాధించారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అరాచక, అవినీతి, రైతు వ్యతిరేక విధానాలకు, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసినందుకు ఓటు ద్వారా ప్రజలు వైసీపీకి వేటు వేశారని వివరించారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులకు అండగా నిలబడ్డ అన్ని వర్గాల ప్రజలకు అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
AP Panchayat By Election Results: రాష్ట్రంలో 34 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. 34 సర్పంచ్ సీట్లలో 22 స్థానాలను వైసీపీ మద్దతుదారులు గెలుచుకోగా.. 9 స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. మరో 2 సీట్లను టీడీపీ, జనసేన ఉమ్మడి మద్దతుదారులు గెలుచుకున్నారు. ఒక సర్పంచ్ స్థానంలో వైసీపీ రెబల్ మద్దతుదారు విజయం సాధించారు. అయితే 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలిచిన 8 స్థానాల్లో ప్రస్తుతం టీడీపీ మద్దతుదారులు గెలవడం గమనార్హం.