కరోనా మహమ్మారి కట్టడికి మాస్కు తప్పనిసరిగా ధరించాలంటూ అధికారులు పదేపదే సూచిస్తున్నా... ఇప్పటికీ పలువురు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు జిల్లాలో వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనూ మాస్కులు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. స్వీయ రక్షణతోనే కొవిడ్‌ని కట్టడి చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇందుకు అనేక అవగాహన సదస్సులు నిర్వహించారు. ఆ తర్వాత నుంచి మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు చేపట్టారు. గత రెండు నెలలుగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మాస్కులు ధరించని వారిపై 64,271 కేసులు నమోదు చేశారు. సుమారు రూ.2.50 లక్షల వరకు అపరాధ రుసుం విధించారు. నేటికీ అనేకమంది మాస్కులు ధరించకుండా రోడ్లపై యథేచ్ఛగా సంచరించడం సమస్య మారుతోంది. కొవిడ్ నుంచి రక్షణకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం తప్పనిసరి అని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పేర్కొన్నారు. వీటి వలన కలిగే ప్రయోజనాలపై అనేక అవగాహన సదస్సులు నిర్వహించాం.. అయినా ఇప్పటికీ పలువురు మాస్కు లేకుండా బయట తిరుగుతున్నారు.. ఇలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: ప్రజా సమస్యలను తెలుసుకునే హక్కు లేదా?: తెదేపా