Amaravati Farmers protests: హైకోర్టు తీర్పు వచ్చే వరకూ ఆగలేమన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో ఆర్5 జోన్ లే అవుట్లలో హడావుడిగా పనులు చేపట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. స్థానికులు, స్థానికేతరుల మధ్య చిచ్చుపెట్టేందుకు సర్కారు యత్నిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో లబ్ధి కోసమే జగన్ తాపత్రయమని అమరావతి రైతులు మండిపడుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని కృష్ణాయపాలెం, నిడమర్రులో జేసీబీలతో చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పనులు ఉద్రిక్తతలకు దారి తీసింది. అమరావతి రైతులు వైసీపీ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను ఆపాలంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రులో ప్రభుత్వం చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పనులు వివాదానికి తెరలేపింది. వివిధ ప్రాంతాల రైతులు, మహిళలు.. రెండు ప్రాంతాలకు చేరుకుని తమ నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరుపై భగ్గుమన్నారు. సీఆర్డీఏ అధికారుల చర్యలతో పాటు ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాజధానిని నాశనం చేయడానికే పూనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో లబ్ధి కోసమే ఆర్5 జోన్ ఎత్తుగడ వేశారని రాజధాని రైతులు విమర్శించారు.
నిడమర్రులో జేసీబీతో భూమి చదును చేసేందుకు సీఆర్డీఏ అధికారుల ప్రయత్నాన్ని రైతులు అడ్డుకుని నిరసన తెలిపారు. తమ భూములను అభివృద్ధి చేసి.. అనంతరం మిగిలిన భూమిని ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. ఉన్నతాధికారుల నుంచి జంగిల్ క్లియరెన్స్ పనులకు సంబంధించిన ఉత్తర్వులు ఏమైనా ఉన్నాయా? వాటిని చూపించండి అని నిలదీయడంతో పనులు ఆగిపోయాయి. సమాచారం తెలుసుకున్న మంగళగిరి గ్రామీణ సీఐ భూషణం, దుగ్గిరాల ఎస్సై శ్రీనివాసరెడ్డి, తమ సిబ్బందితో కృష్ణాయపాలెం, నిడమర్రు చేరుకున్నారు. వారు రైతులు, మహిళలతో చర్చలు జరిపారు. శాంతియుతంగానే నిరసన తెలపాలని కోరారు.
మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రులో ప్రతిపాదిత లేఅవుట్లలో ముళ్లకంపలు తొలగిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోని భూముల్లో నిరసన తెలిపారు. దీంతో సీఆర్డీఏ ఉద్యోగులు, సంబంధిత గుత్తేదారు సిబ్బంది పనులను నిలిపివేశారు. రైతులు వెళ్లిపోయిన అనంతరం మధ్యాహ్నం తిరిగి పనులు ప్రారంభించారు. మిగిలిన మందడం, కురగల్లు, ఐనవోలులో కూడా నేటి నుంచి పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. కాగా స్థానికులు, స్థానికేతరుల మధ్య గొడవలు పెట్టేందుకే ప్రభుత్వం ఈ ఎత్తుగత వేస్తోందని రైతులు మండిపడుతున్నారు.
"జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్‌ను విచ్ఛిన్నం చేయాలని ఆర్5 జోన్ సృష్టించారు. గత ప్రభుత్వం ఆర్4 జోన్‌ను ఏర్పాటు చేసింది. దానిలో 965 ఎకరాల భూమిని నిర్ణయించారు. ఇప్పుడు సీఎం జగన్ వచ్చి 900 ఎకరాలను ఆర్5 జోన్‌గా ఏర్పాటు చేసి.. వేరే ప్రాంతాల నుంచి దళితులను తీసుకుని వచ్చి ఇక్కడ స్థలాలను ఇవ్వాలని అనుకుంటున్నారు. అక్కడి వారికి ఇక్కడ భూములను ఇచ్చేదానిలో ఆంతర్యం ఏమిటి?మీ దుష్ట పన్నాగాన్ని మా అవరావతి రైతులం తిప్పికొడతాం. జగన్మోహన్ రెడ్డి అంతం.. మా రైతుల పంతం.. త్వరలోనే జగన్ పతనం ఖాయం" - మార్టిన్ లూథర్, దళిత రైతు
ఇవీ చదవండి: