జోరు వర్షంలోనూ రాజధాని రైతులు నిరసన కొనసాగించారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఉద్యమం ప్రారంభించి 650 రోజులు అవుతున్న సందర్భంగా తుళ్లూరులో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున మానవహారం(CAPITAL FARMERS PROTEST) చేపట్టారు. గులాబ్ తుఫాను ప్రభావంతో వర్షాలు పడుతున్నా.. రైతుల మొక్కవోని దీక్షతో ఉద్యమస్ఫూర్తిని చాటారు. గొడుగులు పట్టుకొని జై అమరావతి అంటూ వర్షంలోనూ నినాదాలు చేశారు.
జగన్ ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని మహిళలు తమ ప్రాణ సమానమైన భూములను ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చామన్నారు. ఇప్పుడు వర్షంలో తడుస్తూ ఉద్యమం చేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని కోరారు.