FARMERS FACING PROBLEMS DUE TO HORSESHOES: గుంటూరు జిల్లాలోని జాగర్లమూడి నుంచి వట్టిచెరుకూరు మండలం మీదుగా కాకుమాను మండలానికి అప్పాపురం ఛానల్ 43 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. ఈ కాల్వ ద్వారా 25 వేల ఎకరాల ఆయకట్టు సాగు చేస్తున్నారు. అయితే వట్టి చెరుకూరు దిగువ ప్రాంతం నుంచి కాకుమాను వరకు అప్పాపురం ఛానల్ గుర్రపుడెక్కతో నిండిపోయింది. ఎటు చూసినా, ఎక్కడ కాలు పెట్టినా గుర్రపుడెక్కే దర్శనమిస్తోంది. ఒక్క చుక్క నీరు కూడా కాల్వలో కనిపించడం లేదు.
దాదాపు 18 వేల ఎకరాలకు సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ఎకరానికి 2 నుంచి 3 గంటల్లో నీరు పెడతారు. ఇప్పుడు ఒక ఎకరం పొలం తడపాలంటే రాత్రింబవళ్లు ఎదురుచూపులు తప్పడం లేదు. కాల్వలో కొంచెం నీరు కనిపించగానే రైతులు పొలాలకు ఇంజన్ స్టార్ట్ చేస్తున్నారు. మోటర్ పెట్టిన అరగంటలోనే ఆ కొద్దిపాటి నీరు కూడా అయిపోతుంది. తిరిగి నీటి జాడ వచ్చే వరకు ఎదురుచూపులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు.
"అప్పాపురం ఛానల్లో గుర్రపుడెక్క నిండుకోవడం వల్ల 15 రోజుల నుంచి నీరు రావడంలేదు. ఉన్న నీరు ఇంజన్లకు అందడం లేదు. ఒక్క తడి వేసుకుంటే పెసర పండిద్దామనుకుని ఎంత కష్ట పడ్డ దానికి కూడా నీరు రావడం లేదు. ఈ కాల్వలో ఉన్న గుర్రపు డెక్క తీసేస్తే కానీ నీరు రాదు"-కోటిరెడ్డి, వల్లూరు రైతు
అప్పాపురం ఛానల్ కాల్వలో గత ఖరీఫ్ సీజన్లో సాగు నీరు అందించలేదు. ఆ సమయంలో కూడా రైతులు ఇబ్బందులు పడ్డారు. ఏదో వర్షాలు పడటంతో ఆ పైరును కాపాడుకోగలిగారు. వట్టిచెరుకూరు నుంచి కాకుమాను వరకు 13 కిలోమీటర్ల మేర గుర్రపుడెక్క, నాచుతో అల్లుకుపోయింది. ఇప్పటికే 13 లక్షలు ఖర్చు చేసి గుర్రపు డెక్క తొలగించినట్లు అధికారులు చెప్తున్నా.. క్షేత్ర స్థాయిలో చూస్తే మాత్రం ఆ జాడే కనిపించలేదు.
"నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశాను. నాలుగు రోజుల నుంచి నీళ్ల కోసం ఇబ్బంది పడుతున్నాం. అధికారులు ఏమో నీళ్లు వస్తాయి అంటున్నారు కానీ రావడం లేదు. వేరే దగ్గరి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. కానీ ఆ పైపులకు రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతోంది"-ప్రవీణ్, పమిడివారిపాలెం రైతు
వ్యవసాయం సలహా మండలి జిల్లా చైర్మన్ నల్లమోతు శివరామకృష్ణ స్వగ్రామం కాకుమాను. ఈ మండలంలో రైతులే ఇబ్బందులు పడుతున్న పట్టించుకున్న వారేలేరని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. అధికారులు గుర్రపు డెక్క, నాచు తొలగించి నీరు ఇవ్వకపోతే వేల ఎకరాలలో పైరులు నిలువునా ఎండిపోతాయని కర్షకులు వాపోతున్నారు.
ఇవీ చదవండి: