ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న 22 శాతం మంది విద్యార్థులు ఉదయం ఎలాంటి అల్పాహారం తీసుకోవటం లేదు. ఇదే విషయాన్ని మధ్యాహ్న భోజన పథకంపై వేసిన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ సమీక్ష కమిటీ నివేదికలో పేర్కొంది. గతేడాది ఈ కమిటీ నవంబర్ 12 నుంచి 18వ తేదీ వరకు సమీక్ష నిర్వహించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలోని 53 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సర్వే నిర్వహించింది. సకాలంలో ఆహారం తీసుకోకపోవటంతో విద్యార్థుల్లో.. వయసుకు తగ్గ పొడవు, బరువు లేకపోవడం, అనారోగ్య సమస్యలు వంటి తదితర అంశాలను గుర్తించారు. ఆయా జిల్లాలో మొత్తం 659 మంది విద్యార్థులను పరిశీలించగా వారిలో వయసుకు తగ్గ బరువు లేని వారి సంఖ్య 320 ఉన్నట్లు గుర్తించారు.
ఉదయం పూట అల్పాహారం అందించే పథకం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తే విద్యార్థుల హాజరు శాతం పెరిగే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పౌష్టికాహారం అందటంతో పిల్లలు చదువుపై దృష్టి సారించి వారి ఉజ్వల భవితకు బాటలు వేయోచ్చని భావిస్తున్నారు.