వైకాపా పాలకులు ప్రజలను మభ్య పెట్టి, మసి పూసి మారేడు కాయ చేస్తూ మోసం చేస్తున్నారని భాజాపా నాయకులు విమర్శించారు. వినుకొండ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వినుకొండలో శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం చేశామని వైకాపా నాయకులు, మున్సిపల్ అధికారులు గొప్పలు చెప్పటమే తప్ప.. మార్పు శూన్యమని అన్నారు. గతంలో మాదిరిగానే రెండు రోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నారని.. ఆ నీరు కూడా రంగు మారి మురికిగా ఉంటోందని ఆరోపించారు. వైకాపా మోసపూరిత మాటలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తామే ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేసుకోవడం వైకాపాకు సిగ్గుచేటని భాజాపా రాష్ట్ర కార్యదర్శి మాగంటి సుధాకర్ యాదవ్ అన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాల్లో సింహభాగం మోదీ ప్రభుత్వానివేనని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా.. కేంద్రం 148 పథకాలు ప్రవేశపెడితే... వాటికి సీఎం జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు వేసుకొని విస్తృత ప్రచారం చేసుకోవడం సరికాదని చెప్పారు. రాష్ట్రంలో 24 లక్షల మందికి ఇళ్లు ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వస్తే.. అర్హులైన పేదల్లో ఒక్కరికి కూడా ఇచ్చేందుకు వైకాపా ప్రభుత్వం ముందుకు రాలేదని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మోడల్ సిటీలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తుంటే.. దానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా అబద్ధపు ప్రచారాలు చేస్తోందని దుయ్యబట్టారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆర్థిక వనరులు ఎక్కడివో సీఎం చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ నిధులను పక్కదోవ పట్టిస్తూ.. ప్రభుత్వం వారిని మోసం చేస్తుందని మండిపడ్డారు. ఇవన్నీ వాస్తవాలని నిరూపించడానికి భాజపా సిద్ధంగా ఉందని.. సీఎం జగన్, వైకాపా నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా అని మాగంటి సుధాకర్ సవాల్ విసిరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, న్యాయవాది అప్పారావు, మేడం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
వైకాపాతో కొందరు పోలీసులు, అధికారులు కుమ్మక్కు.. ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ