రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం అవుతున్నాయని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు. గుంటూరులోని భాజపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అంతర్వేది విషయంలో కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించినా ఫలితం ఏమీ ఉండదన్న దేవాదాయ శాఖ మంత్రి వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కేంద్రం రంగంలోకి దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దేవుళ్ల బొమ్మలకు చేతులు తీసేస్తే ఏమిటని మంత్రి మాట్లాడటం, ఒక ఐజీ నేరుగా మతప్రచారం చేయటం ఇవన్నీ హిందూ సమాజాన్ని నాశనం చేయడానికేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు, విగ్రహాల ధ్వంసంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్లు తెలిపారు.
పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిపై చర్యలు ఏవి..?
ఆలయాలపై దాడులు చేశానని చెప్పిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని అరెస్టు చేసి సాదాసీదా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని ఆరోపించారు. విదేశీ నిధులతో ప్రవీణ్ చేస్తున్న మత మార్పిడిల గురించి ఎందుకు దర్యాప్తు జరపలేదని ఎంపీ ప్రశ్నించారు. రాష్ట్రంలో పాస్టర్ల సంఖ్య ఎంత...ఎంతమందికి ఆర్థిక సహాయం ఇస్తున్నారో వాస్తవాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
భాజపా నేతలపై చర్యలెందుకు..?
నిజమైన దోషులను పట్టుకోకుండా.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన భాజపా నేతలను అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. సత్తెనపల్లి భాజపా నేతను పోలీసులు అరెస్టు చేయటం దారుణమన్నారు. ఆలయాలపై దాడులు నిరసిస్తూ కపిల తీర్థం నించి రామతీర్థం వరకూ యాత్ర జరగనుందని.. దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: అర్బన్ ఎస్పీ