Big size lagoons on Road: ఇవి స్విమ్మింగ్ పూల్స్ అనుకుంటున్నారా.. లేదు.. ఇంకుడు గుంతలని భావిస్తున్నారా.. పైనుంచి చూడండి కచ్చితంగా కనిపెడతారేమో.. ఒక్కచోటే ఇన్ని గుంతలున్నాయంటే.. ఇవి పంటకుంటలు అనుకుంటారా ఏంటి? అలాగైతే ఈ మడుగుల్లో మీరూ అడుగులు వేసినట్లే.. ఇదీ ఓ రోడ్డే.. నమ్మక తప్పదు మరి.. ఇదేదో మారుమూల పల్లెకో, గిరిజన గూడేనికో.. వెళ్లే రోడ్డు కాదు. రాష్ట్రంలోనే ప్రధాన నగరాల్లో ఒకటైన గుంటూరులోని ఒక ప్రధాన రహదారి.
పైనుంచి చూడడానికి ఏముంది చిన్నగోతులేగా అనుకునేరు.. కిందకు వెళ్తే వామ్మో ఇవేం గోతులు అని బెంబేలెత్తిపోవాల్సిందే. ఎందుకంటే ఆటోలు, బైకులు, చివరకు బస్సులైనా సరే ఈ గోతుల్లో, అందులో నిలిచిన నీళ్లలో ఈదుతుంటాయి.
చూసేవాళ్లకు మనకే ఇలా ఉంటే.. తిరిగే వాళ్లకు ఎలా ఉంటుంది చెప్పండి. రోడ్డుమీద గుంతలు కాదు.. గుంతల మధ్య రోడ్లు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ సాహసయాత్ర చేయడం.. సురక్షితంగా రోడ్డు దాటినవాళ్లు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం, డ్రైవింగ్ వచ్చినా.. ఈ రోడ్డుమీద నడపలేక పడిపోవటం, ఎవరో ఒకరు వచ్చి లేపటం.. ఒంట్లో అవయవాలు, వాహనంలో పార్టులు బాగున్నాయో లేదో చూసుకోడం ఇవన్నీ.. ఈ రోడ్డులో వెళ్లేవాళ్లకు అలవాటైపోయింది.
గుంటూరు నుంచి పేరేచర్ల వెళ్లే ఈ మార్గంలో.. నిత్యం ఎందరో ప్రజాప్రతినిధులు తిరుగుతూనే ఉంటారు. ఒళ్లంతా హూనమైనా.. బయటకు ఆహో ఓహో అని పొగిడే నేతలూ ప్రయాణిస్తుంటారు. కాకపోతే వాళ్లెవరూ చెప్పుకోలేరు. వాళ్లలాగే రోజూ ఈ రోడ్డులో తిరిగే ఆటోవాలాలు ఇదిగో ఇలా.. గుండెలు బాదుకుంటున్నారు.
ఈ రహదారి రోడ్లు భవనాల శాఖ పరిధిలోకి వస్తుందని.. నగరపాలక సంస్థ అధికారులు మిన్నకున్నారు. గతంలో పలకలూరు పంచాయతీగా ఉన్నప్పటికీ మున్సిపల్ ఎన్నికలకు ముందే నగరపాలక సంస్థలో విలీనం చేశారు. అప్పట్నుంచీ నగరపాలక సంస్థే పన్నులు పిండుకుంటోంది. కానీ.. రోడ్డు వేయాలంటే మాత్రం మా పరిధి కాదంటూ మొహం చాటేస్తోంది.
ఇదీ ఘనత వహించిన గుంటూరు నగరంలోని ఓ రోడ్డు దుస్థితి. జులై 15లోగా రహదారుల రూపురేఖలు మార్చాలని ముఖ్యమంత్రి గత సమీక్షలో అధికారులకు చాలా చాలా గట్టిగా చెప్పారు. సీఎం నిర్దేశించిన గడువుకు ఇంకా 3రోజులే సమయం ఉంది. ఈలోగా అధికారులు ఈ రోడ్డును ఎలా బాగు చేస్తారో చూడాలి మరి.
ఇదీ చదవండి: