పులిచింతల ప్రాజెక్టులో గేటు విరిగిపోయిన ప్రాంతంలో తాత్కాలిక గేటు ఏర్పాటు చేసేందుకు 24 గంటలకు పైగా సమయం పడుతుందని... నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. గేటు విరిగిపోయవడానికి గల కారణాల పై కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. తాత్కాలిక గేటు ఏర్పాటు కోసం జలాశయంలో నీటిని ఖాళీ చేస్తున్నట్లు చెప్పారు. అయితే ప్రాజెక్టుకు సంబంధించి కాంక్రీటు నిర్మాణాల్లో ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు.
పులిచింతల నుంచి భారీగా నీటి విడుదలకు అధికారుల సన్నాహాలు చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో 16వ నెంబర్ గేటు ఊడిపోయింది. తాత్కాలిక గేటు ఏర్పాటుకు అధికారుల చర్యలు చేస్తున్నారు. 11 గేట్ల ద్వారా 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నీటిమట్టం తగ్గిస్తేనే... తాత్కాలిక గేటు ఏర్పాటుకు అవకాశం ఉంది.డ్యామ్ వద్దకు చేరుకుని అధికారులతో మంత్రి అనిల్ పరిశీలించారు. గేట్లు నిర్మించిన బెకాన్ సంస్థ ప్రతినిధుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రాజెక్టు వద్దకు సాంకేతిక నిపుణులను పిలిపిస్తున్నారు
సాంకేతిక సమస్య కారణంగా పులిచింతల ప్రాజెక్టు గేట్ ఊడిపోవటంతో ప్రాజెక్టు నుంచి నీరు దిగువకు విడుదల అవుతోంది. దీంతో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ హెచ్చరించారు. ముంపు ప్రభావిత అధికారులను అప్రమత్తం చేశారు. ఊడిన గేట్ స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయాల్సి ఉందని ఈ కారణంగా డ్యాం లో నీటి నిల్వ తగ్గించాల్సి వస్తోందని అధికారులు వెల్లడించారు. నీటి ఒత్తిడి ఇతర గేట్లపై పడే అవకాశం ఉన్నందున నీటి మట్టాన్ని తగ్గించిన అనంతరం మరమ్మత్తులు చేపట్టనున్నారు.
16 గేట్ నుంచి ఆకస్మికంగా వస్తున్న నీరు ప్రకాశం బ్యారేజీకి 8 నుంచి 12 గంటల వ్యవధిలో చేరుకుంటుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. బ్యారేజీకి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందని ఈ మొత్తాన్ని యథాతథంగా దిగువకు విడుస్తున్నట్టు తెలిపారు. పులిచింతల డ్యాం వద్ద ప్రస్తుతం ఔట్ ఫ్లో 2,00,804 క్యూసెక్కులు ... ఇన్ ఫ్లో 1,10,000 క్యూసెక్కులు ఉన్నట్టు తెలిపారు. అలాగే ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఔట్ ఫ్లో 33,750 క్యూసెక్కులు,...ఇన్ ఫ్లో 41,717 క్యూసెక్కులు ఉంది.
ఇదీ చూడండి.
విరిగిన పులిచింతల ప్రాజెక్టు గేటు.. లక్ష క్యూసెక్కుల నీరు వృథా