AP Village Volunteers Strike : ముఖ్యమంత్రి జగన్ జగన్ మోహన్ రెడ్డిపై సొంత సైన్యం యుద్ధం ప్రకటించింది. గౌరవ వేతనం పెంచడం లేదని, సర్వీసులు క్రమబద్ధీకరించడం లేదని ఇన్నాళ్లూ గ్రామ వాలంటీర్లలో గూడుకట్టుకున్న అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. ఇవాళ్టి నుంచి పలు జిల్లాల్లో సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే "ఆడుదాం ఆంధ్రా (Aadudham Andhra)" కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. సమ్మె నుంచి వైదొలగేలా చేయాలని అధికారులు తీవ్రంగా యత్నించినా ఫలితం లేకపోయింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఇవాళ్టి నుంచి యథావిధిగా సమ్మె చేయాలని నిర్ణయించారు.
Village Volunteers Decision To Boycott Adudam Andhra Program : జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.65 లక్షల మంది వాలంటీర్లను 2019 అక్టోబరులో నియమించింది. వీరికి నెలకు 5 వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వీరు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాక ప్రభుత్వం తరఫున నిర్వహించే సర్వేల్లోనూ వీరినే భాగస్వాములను చేస్తున్నారు. సీఎం జగన్ పలు సందర్భాల్లో వాలంటీర్లు తమ సైన్యమని బాహాటంగానే చెప్పారు. అయితే ఆయన చెప్పినవన్నీ తీపి మాటలేనని గౌరవ వేతనం పెంచే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్న అసంతృప్తి వాలంటీర్లలో ఇటీవల బాగా ఏర్పడింది. పొరుగు సేవల సిబ్బంది, కాంట్రాక్టు కార్మికులకు ఇస్తున్న సాటివేతనం కూడా తమకు ఇవ్వడం లేదని అంటున్నారు.
నేటి నుంచి 'ఆడుదాం ఆంధ్రా' క్రీడా పోటీలు, ప్రారంభించనున్న సీఎం జగన్
Adudam Andhra Program in AP : ఎన్నికలు సమీపిస్తున్నా నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన వాలంటీర్లు సమ్మెకు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా ఈ నెల 26 నుంచి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు, కర్నూలు జిల్లా హొళగుంద, మన్యం జిల్లా పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తదితర ప్రాంతాల్లో వాలంటీర్లు సమ్మెకు వెళ్తున్నట్లు ఈ నెల 23న మండల పరిషత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మిగతా జిల్లాల్లోని వారు 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు. వాలంటీర్లకు చెందిన వాట్సప్ గ్రూపుల్లో ఈ విషయం మంగళవారం హల్‌చల్ చేసింది.
రసాభాసగా సర్వసభ్య సమావేశం - వాలంటీర్ల తీరుపై వైసీపీ సర్పంచులు,ఎంపీటీసీల ఆక్రోశం
రంగంలోకి వైఎస్సార్సీపీ నేతలు : చాలా జిల్లాల్లో వాలంటీర్లు సమ్మెలో పాల్గొంటారన్న విషయం తెలియగానే మండల పరిషత్ అధికారులు, వైఎస్సార్సీపీ నేతలు రంగంలో దిగారు. వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆందోళన అవసరం లేదని ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. కృష్ణా జిల్లాలో కొందరు అధికారులు సమస్యలపై చర్చించేందుకు ఇవాళ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వాలంటీర్లకు సమాచారం పంపారు. "ఆడుదాం ఆంధ్రా" కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు. అయినా వాలంటీర్లు పట్టించుకోలేదు.