AP Tops in Attacks on SC and ST: ఇటీవల కాలంలో సభ ఏదైనా సరే.. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన లేకుండా ఆయన ప్రసంగాన్ని ముగించడం లేదు. నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ భుజానికి ఎత్తుకుంటారు. పెత్తందారులతో యుద్ధం చేస్తున్నామని, ఎన్నికల్లో సైన్యంగా నిలవాలని కోరతారు. కానీ నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీలపై కొంతకాలంగా జరుగుతున్న దాడులు, దారుణాల్లో అధికార పార్టీకి చెందిన పెత్తందారులే నిందితులుగా ఉంటున్న వైనాన్ని మాత్రం విస్మరిస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సెక్షన్-18 ప్రకారం.. ఏటా మార్చి 31 నాటికి ఆయా రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులపై వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలి. చట్టాన్ని అమలు చేస్తున్న తీరును వివరించాలి. ఈ మేరకు 2021లో జరిగిన దారుణాల గణాంకాలను దక్షిణ భారతంలోని తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కేంద్రానికి నివేదించాయి. వాటిని విశ్లేషిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎస్సీ, ఎస్టీలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు తేలింది.
జనాభా పరంగా మనకంటే పెద్ద రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలతో పోల్చితే ఏపీలోనే ఎస్సీ, ఎస్టీలపై దాడులు, అఘాయిత్యాల కేసులు ఎక్కువగా నమోదవడం తీవ్రతను తెలియజేస్తోంది. 2021లో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద 2 వేల 717 కేసులతో దక్షిణాదిలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులపై 60 రోజుల్లోనే పోలీసులు ఛార్జిషీట్ వేయాలి. ఈ గడువును మరింత తగ్గించాలని ఎస్సీ, ఎస్టీ సంఘాలు పోరాడుతుంటే, చాలా కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం 60 రోజులైనా ఛార్జిషీట్ దాఖలు చేయలేకపోతోంది. 11వందల 72 కేసుల్లో గడువులోగా ఛార్జిషీట్ వేయగా, 641 కేసుల్లో 60 రోజులు దాటాక సమర్పించినట్లు నివేదిక చెబుతోంది. మొత్తంగా 2 వేల 717 కేసులకు ఛార్జిషీట్ వేసింది 17 వందల 13 కేసుల్లోనే. మిగతా కేసుల విషయాన్ని నివేదికలో ప్రస్తావించలేదు.
ఛార్జిషీట్ ధాఖలులో జాప్యంతో చాలావరకు అట్రాసిటీ కేసులు కోర్టుల్లో వీగిపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి నివేదించింది. అలాగని వీగిపోయిన తర్వాతైనా అప్పీలుకు వెళ్లి బాధితుల పక్షాన ప్రభుత్వం పోరాడటమూ లేదు. 2021 వ సంవత్సరంలో 340 కేసులు వీగిపోతే, రాష్ట్ర ప్రభుత్వం 2 కేసుల్లోనే అప్పీలుకు వెళ్లింది. వీగపోయిన ప్రతి కేసులోనూ అప్పీలుకు వెళ్లాల్సిన అవసరం ఉందని 2008లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఆంధ్రప్రదేశ్లో అమలు కావట్లేదు. కర్ణాటకలో 2021లో 18 వందల 1 అట్రాసిటీ కేసులు నమోదైతే.. 99.8 శాతం అంటే 17వందల 99 కేసుల్లో సకాలంలో ఛార్జిషీట్ వేశారు. కేరళలోనూ 11వందల 55 కేసులకు 835 కేసుల్లోనూ, తమిళనాడులో 903 కేసుల్లో పోలీసులు అభియోగపత్రాలు సమర్పించారు.