కృష్ణా నది వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజుతో కలిసి ఆమె ఇవాళ గుంటూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మంగళగిరి, తెనాలి, వేమూరు నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో పంట నష్టాన్ని పరిశీలించారు. అలాగే ముంపు బారిన పడిన గ్రామాల్లో తిరిగి ప్రజలతో మాట్లాడారు.
వరదల కారణంగా గ్రామాలకు వెళ్లే మార్గం లేకపోవటంతో మంత్రులు, అధికారులు పడవల్లో పర్యటించారు. అలాగే గ్రామాల్లో రోడ్లపై నీరు ఉండటంతో అక్కడ ట్రాక్టర్లో తిరుగుతూ.. పరిస్థితిని సమీక్షించారు. వరద కారణంగా తాము పడుతున్న ఇబ్బందులను ప్రజలు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. అలాగే పంటలు సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పసుపు, కంద, మినుము, అరటి, మిరప తోటలు వేసినట్లు వివరించారు. ఇప్పటికీ పంటలన్నీ నీటి ముంపులో ఉన్నాయని.. పెట్టిన పెట్టుబడులన్నీ వరద పాలయ్యాయని గోడు వెళ్లబోసుకున్నారు.
వరద నష్టం అంచనాల కోసం అధికారులు వచ్చినపుడు ఆ వివరాలు ఇవ్వాలని మంత్రులు సూచించారు. ప్రస్తుతం సహాయ చర్యలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. సహాయచర్యల్లో ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నట్లు మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ఈ పర్యటనలో మంత్రుల వెంట ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, రైతు సాధికార సంస్థ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఉన్నారు. భట్టిప్రోలు మండలం చింతమోటులో పర్యటిస్తున్న సమయంలో తమ గ్రామంలో రెండు రోజులుగా కరెంటు లేదని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తెలిపారు.
హెచ్చరిక: రాగల 4 గంటలపాటు రాష్ట్రంలో వర్షాలు