AP Government Neglecting the Expansion of Roads: రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏ గ్రామానికి వెళ్లినా.. రోడ్లతో నరకం చూస్తున్నామని, ఎన్నేళ్లకు బాగు చేస్తారంటూ? ప్రజలు నిలదీస్తున్నారు. కనీసం రోడ్లు కూడా వేయించలేకపోతే ఎమ్మెల్యేగా ఉండి ఏం ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ మాత్రం.. గత ప్రభుత్వం కంటే మనమే ఎక్కువ నిధులు వెచ్చించామని, రహదారులు మెరిసిపోవాలంటూ సమీక్షల్లో పదేపదే చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై సీఎం క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే.. ఎంత ఘోరంగా ఉన్నాయో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.
రాష్ట్రంలో రహదారులన్నీ పూర్తిగా బాగు చేయాలి. కొందరు కడుపుమంటతో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. దీనికి మందు లేదు. అందుకే రోడ్లను బాగు చేసిన తర్వాత అవి ఎలా ఉన్నాయో వెల్లడించేలా 'నాడు-నేడు'' ద్వారా చిత్రాలను ప్రజల ముందు ప్రదర్శించాలి.. ఈ ఏడాది జనవరి 23న రహదారులపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ వ్యాఖ్యలివి.
Damage Roads in AP రాష్ట్రంలో నరకప్రాయంగా రోడ్లు.. నిరసనలు వెల్లువెత్తుతున్న పట్టించుకోని ప్రభుత్వం!
క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నం: కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నం. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై గడప గడపలో ఎమ్మెల్యేలకు నిరసన సెగ ఎదురవుతోంది. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావును రోడ్ల గురించి స్థానికులు నిలదీశారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు గ్రామస్తులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ప్రస్తుతం రహదారులు నిర్మించలేమని.. సంపదంతా సంక్షేమ పథకాలకే ఖర్చవుతోందని ఆయన స్పష్టం చేశారు. రోడ్లు వస్తున్నాయి.. దారిలో ఉన్నాయి.. అంటూ మరో MLA ఎలిజా.. ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం బోగోలులో జనం నిలదీస్తే వ్యంగ్యంగా బదులిచ్చారు.
ఎన్‌డీబీ రుణం ఇస్తున్నా వినియోగించుకోలేని దుస్థితిలో ప్రభుత్వం: రాష్ట్రంలో రహదారుల విస్తరణకు సహకరించేలా.. ఓ విదేశీ బ్యాంకు రుణం కింద నిధులిచ్చి ప్రాజెక్టు మంజూరు చేసినా సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. రెండేళ్లలో మొదటి దశ రోడ్ల పనులు పూర్తికావాల్సిన NDB ప్రాజెక్టులో రెండున్నరేళ్లు అవుతున్నా.. 20శాతం పనులు కూడా పూర్తి కాలేదంటే ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో స్పష్టమవుతోంది. మండల కేంద్రాల నుంచి... జిల్లా కేంద్రానికి కలిపే రోడ్లను రెండు వరుసలుగా విస్తరించేందుకు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్-NDB.. 6,400 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు మంజూరు చేసింది. ఇందులో 70 శాతం NDB రుణంగా ఇస్తుండగా, మిగిలిన 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంది. తొలి దశలో 1,243 కి.మీ విస్తరణ, 204 వంతెనలకు కలిపి 3,013 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులో NDBరుణం 2వేల109 కోట్ల రూపాయలు కాగా మిగిలిన 904 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంది.
ఆయా జిల్లాల్లోని పనులన్నీ కలిపి ప్యాకేజీగా చేసి టెండర్లు నిర్వహించారు. 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో గుత్తేదారులకు ఈ పనులు అప్పగించారు. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని ఒప్పందం చేసుకున్నారు. కానీ ఇప్పటికి రెండున్నరేళ్లు అవుతున్నా.. రాష్ట్రమంతా కలిపి సగటున 19.69 శాతం పనులు మాత్రమే జరిగాయి. అనంతపురం, కర్నూలు, విశాఖ జిల్లాల్లో 10 శాతం పనులు కూడా జరగలేదు. ఈ ప్రాజెక్టులో మొదటి నుంచి చెల్లింపుల విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో గుత్తేదారులు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. NDBతో జరిగిన ఒప్పందం ప్రకారం.. బ్యాంకు కొంత మొత్తం ఇచ్చిన ప్రతిసారి దానికి 30 శాతం మేర రాష్ట్ర ప్రభుత్వం కూడా వెచ్చించాల్సి ఉంది. ఈ నిధుల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలని NDB సూచించింది. వీటికి ప్రభుత్వం అంగీకరించడంతో NDB తొలివిడతగా 230 కోట్ల రూపాయలు గత ఏడాది జులైలో విడుదల చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా 90 కోట్ల రూపాయలు జత చేయాల్సి ఉంది. కానీ తన వాటా జమ చేయని ప్రభుత్వం.. NDB నిధుల నుంచే గుత్తేదారులకు 200 కోట్ల రూపాయలు చెల్లించింది. 70కోట్ల రూపాయల బిల్లులు అప్‌లోడ్ చేసినా.. ఇంకా మంజూరు కాలేదు.
Youngman Protest for Road: రోడ్డుపై అడ్డంగా మంచం వేసి.. ఏలూరులో యువకుడి వినూత్న నిరసన
పనులు వదులుకునేందుకు సిద్ధమవుతున్న గుత్తేదారులు: ప్రభుత్వ తీరుతో విసుగు చెందిన గుత్తేదారులు.. ఈ పనులు వదులుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పనులను చిత్తూరు జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన గుత్తేదారు సంస్థ దక్కించుకుంది. చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం కారణంగా పనులు చేయబోమని మూడు నెలల కిందట గుత్తేదారు సంస్థ తెగేసి చెప్పింది. బిల్లులు అప్లోడ్ చేసిన 84 రోజుల్లో చెల్లింపులు చేయకపోతే ఒప్పందం నుంచి వైదొలిగే షరతు ఉందని గుర్తుచేస్తూ సంస్థ నోటీసు ఇచ్చింది. చివరకు అధికారులు సంప్రదింపులు జరిపి ఆ నోటీసు వెనక్కి తీసుకొని గుత్తేదారు కొనసాగేలా చూసేందుకు ఆపసోపాలు పడ్డారు.