AP Contractors bills Problems: కోట్లాది రూపాయలు అప్పులు చేసి ప్రభుత్వ పనులు చేసిన చిన్నా చితకా గుత్తేదారులు.. పెండింగ్ బిల్లుల కోసం 4 ఏళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఆత్మహత్యలే శరణ్యమంటూ పలుమార్లు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించగా.. మరికొందరు ఏకంగా ప్రభుత్వ భవనాలు పైకి ఎక్కి ఆందోళనకు దిగిన సందర్భాలనూ మనం చూశాం. ఒకరిద్దరు ఆత్మహత్యకు సైతం పాల్పడ్డారు.
వీళ్లెవరినీ పట్టించుకోని ప్రభుత్వం 5 బడా కాంట్రాక్టు సంస్థలకు మాత్రం ఏకంగా 1,500 కోట్ల బిల్లులు చెల్లించింది. ఈ నెల 16, 17 తేదీల్లో వారికి ఈ సొమ్ములు అందాయి. కొన్ని సంస్థలకైతే పెద్ద మొత్తాల్లో ఉన్న మూడు నాలుగు బిల్లులు ప్రభుత్వం చెల్లించేసింది. వీటిలో కీలకమైన ఓ మంత్రి కుటుంబీకులకు చెందిన కంపెనీ, అధికార పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీ, వైసీపీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీ, తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ కుటుంబ సభ్యుల కంపెనీలు ఉన్నాయి.
Pending Bill Payments: సీఎం జగన్‌ను నమ్ముకుని అప్పుల పాలయ్యాను: వైసీపీ కౌన్సిలర్
ఒకవైపు ఏళ్ల తరబడి చిన్న గుత్తేదారులు చిన్న మొత్తాల్లోని బిల్లుల కోసం ఎదురుచూస్తూ ఇబ్బంది పడుతుంటే వారిని వదిలేసి అయినవాళ్లకు పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించడంపై చిన్న గుత్తేదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులకు ఒక విధానమంటూ లేకుండా ఇష్టారాజ్యంగా మారిపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానంలో బిల్లులు చెల్లిస్తే ఎవరూ తప్పుబట్టరు. కానీ ఇష్టానుసారం ప్రభుత్వం సొమ్మును పంచడంపై గుత్తేదారులు మండిపడుతున్నారు.
చిన్న గుత్తేదారులు కొందరు విధిలేక హైకోర్టును ఆశ్రయించి వందల సంఖ్యలో కేసులు వేశారు. బిల్లులు అందక, వడ్డీలు చెల్లించుకోలేక, కొత్త పనులు చేసి టర్నోవర్ జరగక వారు పడుతున్న అవస్థలు ఎన్నో. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం సొమ్మును కేవలం ఐదు సంస్థలకే అప్పగించడం.. అదీ బడాబాబులకే చెల్లించడంతో మిగిలిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెండిగ్ బిల్లుల కోసం చిన్న గుత్తేదారులు చివరకు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శికి సైతం ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరారు.
"బకాయిల వ్యథ.. తీరేదీ ఎన్నడో".. సొమ్ముల కోసం కోర్టు మెట్లెక్కుతున్న వైనం
ఎప్పుడో 2019 ముందు రాష్ట్రంలో జరిగిన నీరు-చెట్టు పనుల బిల్లులు కూడా ఇప్పటికీ చెల్లించలేదు. అవన్నీ చాలావరకు చిన్న మొత్తాలే. వీరంతా కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశించినా బిల్లులు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసులూ నమోదయ్యాయి. ఈ ధిక్కరణ కేసులకు సంబంధించినవే ఇంకా రూ.270 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. ఇవికాక మరో రూ.400 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వీటన్నింటికీ చెల్లింపులు చేయకుండా.. కేవలం తమ పార్టీకి చెందిన నేతల సంస్థలకే చెల్లింపులు చేశారు.
వర్షాకాలం రావడంతో గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో పోలవరం నిర్వాసితులను తరలించాలంటే అనేక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పునరావాస కాలనీల నిర్మాణం, ఇతర పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో రూ.159 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని తక్షణమే చెల్లించాలని కాంట్రాక్టర్లతో పాటు బిల్డర్ల అసోసియేషన్ వరుసగా వినతులు సమర్పిస్తున్నా చెల్లించలేదు. రహదారులు భవనాల శాఖ గత ఆర్థిక ఏడాదిలోనే బిల్లులు చేసి చెల్లించాల్సిన బకాయిలు రూ.332 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. బడ్జెట్ మంజూరు లేక దాదాపు రూ.500 కోట్ల బిల్లులు సీ.ఎఫ్.ఎమ్.ఎస్.లో అప్‌లోడ్ చేయలేదు. పంచాయతీరాజ్‌శాఖలోనూ రూ.430 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. వీటికి పైసా విదల్చని ప్రభుత్వం.. కేవలం ఐదు సంస్థలకే ఏకంగా రూ.1,500 కోట్ల చెల్లింపులు చేసింది.
Aarogyasri: ఆరోగ్య శ్రీ ట్రస్టుకు బకాయిల సుస్తీ.. రూ.900 కోట్ల బిల్లుల పెండింగ్‌తో..