AP CEO Mukesh Kumar Meena: ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన సమాచారం ప్రతివారం రాజకీయ పార్టీలకు నియోజకవర్గస్థాయిలో అందిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. లోపాలులేని ఓటర్ల జాబితా కోసం రాజకీయపక్షాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటింటి ధ్రువీకరణపై అఖిలపక్ష భేటీ నిర్వహించిన ఎన్నికల ప్రధానాధికారి ..EROలు ప్రతివారం క్లెయిమ్‌లు, అభ్యంతరాల జాబితా నియోజకవర్గ స్థాయిలో పార్టీలకు అందిస్తాయని, ఆ వివరాలనే ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు.. CEO తెలిపారు. జులై 21 నుంచి ఇంటింటి ధ్రువీకరణ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపిన ఆయన.. సర్వేలో భాగంగా BLOయాప్ ద్వారా సమాచారాన్ని అప్‌డేట్ చేస్తామన్నారు. బూత్ స్థాయి ఏజెంట్లు BLOలతో కలిసి వెళ్లొచ్చన్నారు. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ల జోక్యంపై మార్గదర్శకాలు విడుదల చేసినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్ తెలిపారు.
ఓటర్ల పరిశీలనకు వాలంటీర్లను రానివ్వద్దు: రాష్ట్రంలో నేటి(జులై 21) నుంచి నెల రోజులపాటు జరగనున్న ఓటర్ల ఇంటింటి పరిశీలనకు వాలంటీర్లు, సచివాలయాల్లోని మహిళా సంక్షేమ కార్యదర్శుల్ని దూరంగా ఉంచాలని తెలుగుదేశం పార్టీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరాయి. పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్చడం, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లు తొలగించడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ఆరోపించాయి. ఇంటింటి పరిశీలనలో భాగంగా బూత్‌స్థాయి అధికారులు దొంగ ఓట్ల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని కోరాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, సీపీఎం సహా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా గురువారం సమావేశం అయ్యారు. స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ, ఉపఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు బూత్‌లను స్వాధీనం చేసుకోవడం, పోలీసులు, వాలంటీర్లను ఉపయోగించి దొంగ ఓట్లు వేయించారని ప్రతిపక్ష నాయకులు గుర్తు చేశారు. అర్హులు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని, ఒకే డోర్ నంబర్‌తో వందల సంఖ్యలో ఉన్న బోగస్ ఓట్లు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లినవారి ఓట్లు తొలగించాలని ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు.
నేటి నుంచి ఇంటింటికి ఓటరు సర్వే: ఓటరు జాబితాలో పేరు ఉందా.. లేదా.. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఇదే చర్చ. ఓటర్ల జాబితాలో చాలా మంది పేర్లు గల్లంతవడం ఒక ఎత్తయితే.. నకిలీ ఓట్ల చేరికల గురించి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఫిర్యాదులు మరోవైపు. తాజాగా ఆ దుమారం దేశ రాజధాని వరకు చేరింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ముందు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ హాజరయ్యారు. ఓటర్ల జాబితాలో కొన్ని తప్పులు జరిగాయని స్వయంగా ఆయనే అంగీకరించారు. దీంతో ఈసీ ఈ నెల 21 నుంచి వచ్చే నెల 21 వరకు రాష్ట్రంలో ఇంటింటికీ ఓటరు సర్వే చేపట్టాలని సూచించింది. దీంతో నేటి నుంచి ఈ ప్రక్రియకు రంగం సిద్ధమైంది.