AP Anganwadi Staff Protest: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల మూడో రోజు నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఆయా జిల్లాల టీడీపీ నేతలు అంగన్వాడీల ఆందోళనకు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా:
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీలు మూడో రోజు సమ్మె బాట పట్టారు. గుంటూరు కలెక్టరేట్ వద్దకు భారీగా తరలివచ్చిన అంగన్వాడీలు మోకాళ్ల మీద కూర్చొని నిరసన తెలిపారు. తమను ప్రభుత్వం బెదిరించేందుకు ప్రయత్నిస్తోందని వర్కర్లు, హెల్పర్లు మండిపడ్డారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం సూచించడాన్ని ఖండించారు.
ఎన్టీఆర్ జిల్లాలో:
ప్రభుత్వం తమపట్ల మొండిగా వ్యవహరిస్తే అంతకుమించి జగమొండిగా ఎదిరించేందుకు సిద్ధంగా ఉన్నామని అంగన్వాడీలన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మైలవరం ఎంపీడీఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కళ్లకు గంతలు కట్టుకుని వందలాది మహిళలు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అక్కాచెల్లెళ్లంటూనే నడిరోడ్డుపై నిలబెట్టారు - అంగన్వాడీల ఆవేదనపై నోరు మెదపని జగనన్న
శ్రీకాకుళం జిల్లాలో:
ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీలకు చిన్నారుల తల్లులు మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి విడీ అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మోకాలపై నిరసన చేపట్టారు. మూడు రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేయడంతో చిన్నారులతో నానాపాట్లు పడుతున్నామని తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు చేశారు.
విజయనగరం జిల్లాలో:
అంగన్వాడీల ఆందోళనపై విజయనగరం జిల్లాలో మూడోరోజు దీక్ష కొనసాగుతోంది. అంగన్వాడీ కార్యకర్తల పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, రిటైర్‌మెంటు బెనిఫిట్స్ రూ.5 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్స్‌కి గ్రాట్యూటీ రూ.5 లక్షలు, ఆయాలకు రూ.3 లక్షలు ఇవ్వాలన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేయించుకుంటూ అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందజేయాలన్నారు. కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల సమ్మెకు సీఐటీయూతో పాటు జనసేన పార్టీ నేత గురాన అయ్యలు మద్దతు తెలిపారు. కాగా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట అప్పలనాయుడు అంగన్వాడీల ఆందోళనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే ఆయన అంగన్వాడీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లాలో:
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో అంగన్వాడీల నిరవధిక సమ్మె మూడో రోజుకు చేరింది. అంగన్వాడీలు వినూత్నంగా మోకాళ్లపై కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సమ్మె విరమించుకోకుంటే అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొడతామని అధికారులు బెదిరిస్తున్నారని మహిళలు పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తమ డిమాండ్లను సాధించే వరకు తమ ఆందోళనను విరమించబోమని స్పష్టం చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో:
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి తహసిల్దార్ కార్యాలయాలు వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కనీస వేతనం రూ.26 వేలు అందించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. టీడీపీ యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు.
అనకాపల్లి జిల్లాలో:
న్యాయబద్ధమైన డిమాండ్లతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. భవిష్యత్తులో జనసేన, తెలుగుదేశం పార్టీల సంయుక్త ప్రభుత్వం ఏర్పడుతుందని తప్పనిసరిగా అంగన్వాడీ కార్యకర్తలకు తమ ప్రభుత్వంలో న్యాయం జరిపిస్తామని హామీ ఇచ్చారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో చేపడుతున్న అంగన్వాడీల నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీతో పాటు అయ్యన్నపాత్రుడు, ఇతర టీడీపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాలకు బలవంతంగా జిల్లా అధికారులు తాళాలు వేయించడం సబబు కాదని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
సమస్యలు పరిష్కరించాల్సిందే - అంగన్వాడీల న్యాయపోరాటం
అన్నమయ్య జిల్లాలో:
అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరులో అంగన్వాడీ వర్కర్స్ సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి రైల్వేకోడూరు నియోజకవర్గ జనసేన నాయకులు మద్దతు తెలిపారు. అంగన్వాడి ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని జనసేన నాయకులు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ కన్నా అంగన్వాడీ వర్కర్లకు వెయ్యి రూపాయలు అదనంగా చెల్లిస్తానని తెలిపి, ఇప్పుడు అనేక యాప్లతో అంగన్వాడీ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో:
అంగన్వాడీ వర్కర్స్‌కు కనీస వేతనం రూ.26 వేలు అందించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి తహసిల్దార్ కార్యాలయాలు వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. టీడీపీ యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో:
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె మూడోరోజు కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోకుండా మూతపడిన కేంద్రాలను ఎట్టి పరిస్థితుల్లోనైనా తెరవాలని రెవెన్యూ సచివాల సిబ్బందికి ఆదేశించడంతో తాళాలు బద్దలు కొట్టే పనిలో నిమగ్నమయ్యారు.
వైఎస్సార్ కడప జిల్లాలో:
అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక దీక్షకు టీడీపీతో పాటు వామపక్షాల నేతలు సంఘీభావం తెలిపారు.
అంగన్వాడీలతో కలిసి మోకాళ్లుపై నిలబడి వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు వేసిన తాళాలను పగలగొట్టమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం సిగ్గుచేటని నేతలు మండిపడ్డారు.
ప్రకాశం జిల్లాలో:
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో గత మూడు రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అంగన్వాడీలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి టీడీపీ ఇంఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి మద్దతు తెలిపారు. అంగన్వాడి కార్యకర్తలతో కలిసి దీక్షలో పాల్గొన్నారు.