Viral Fevers in Alluri District: అల్లూరి జిల్లాలో విష జ్వరాలతో చిన్నారులు అల్లాడుతున్నారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీకి చెందిన 17 మంది చిన్నారులు పాడేరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు గ్రామాలకు చెందిన 80 మంది చిన్నారులు గత ఐదు రోజులుగా జ్వరం, దగ్గు, దద్దుర్లు వచ్చి బాధపడుతున్నారని జిల్లా వైద్యాధికారులకు తెలిసింది.
దీంతో వెంటనే గిన్నెలకోటలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న 17 మంది చిన్నారులను పాడేరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యంగా నిలకడగా ఉందని, చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ నర్సింగరావు తెలిపారు. జ్వరం ఉన్న చిన్నారుల రక్తనమూనాలు విశాఖ కేజీహెచ్‌కు పంపించామని, రిపోర్టులు వచ్చిన తర్వాత నిర్ధారణ చేస్తామన్నారు.
"గత నాలుగు రోజుల నుంచి పిల్లలు చాలా జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ముందుగా దగ్గు వస్తోంది, తరువాత జలుబు వచ్చి జ్వరం వస్తోంది. తరువాత శరీరంపై దద్దుర్లు వస్తున్నాయి. మొత్తం 17 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు". - గొంచంగి గ్రామస్థుడు