Andhra Pradesh Financial Condition Chaotic: అక్టోబరు నెలాఖరులో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఓవర్ డ్రాఫ్ట్‌లోనే ఉంది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం రాష్ట్రం 1,684 కోట్ల ఓడీలో ఉంది. అక్టోబరు ప్రారంభంలోనూ ఇదే వెసులుబాటును ఉపయోగించుకుని జీతాలు, పెన్షన్ల వంటి అవసరాలను తీర్చుకుంది. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 7 వరకు ఏపీ ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్‌లో ఉందని.. ప్రస్తుతం 2,229.83 కోట్ల ఓడీలో ఉందని ఆర్బీఐ తెలిపింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు చర్యలు తీసుకోవాలని.. రిజర్వుబ్యాంకు జనరల్ మేనేజర్ రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అక్టోబరు 9న సమాచారం పంపారు.
ఆ తర్వాత బహిరంగ మార్కెట్లో రుణాలు తీసుకుని, ఇతరత్రా రాబడిని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఓడీ నుంచి బయటపడగా.. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితికి వచ్చింది. అక్టోబరు నుంచి మూడో ఆర్థిక త్రైమాసికం ప్రారంభమైంది. ఈ త్రైమాసికంలో ఇప్పటికే 10 రోజుల పాటు రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్‌లో ఉంది. అంటే ఖజానాలో రాష్ట్ర ఆదాయం లేకపోయినా రిజర్వుబ్యాంకు సర్దుబాటు చేసే మొత్తాలతో అవసరాలు తీర్చుకుంటూ వస్తోంది.
సాధారణంగా రిజర్వుబ్యాంకు ద్వారా కొన్ని రుణ వెసులుబాట్లు ఉంటాయి. ఖజానాలో నిధులు లేకపోయినా తొలుత ప్రత్యేక ఆర్థిక సాయం కింద కొంత మొత్తం వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత వేస్ అండ్ మీన్స్ రూపంలో మరికొంత మొత్తం లభిస్తుంది. అది కూడా దాటిన తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. దాదాపు 2,400 కోట్ల మేర ఓడీ వెసులుబాటు ఉంది. ఆ పూర్తి మొత్తం ఓడీ వరుసగా 5 రోజులకు మించి ఉండకూడదు.
అలాగే ఒక త్రైమాసికంలో 30 రోజులకు మించి ఓవర్ డ్రాఫ్ట్ వసతి వినియోగించుకోకూడదు. ఇలా రిజర్వ్ బ్యాంకు వద్ద వాడుకునే మొత్తాలకు రాష్ట్రం వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. ఎక్కువ రోజులు ఓడీలో ఉండటం సైతం రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘించినట్లే అవుతుంది. సరైన ఆర్థిక నిర్వహణ లేకపోవడం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ రోజులు ఓడీలోనే ఉంటూ వడ్డీల రూపంలో పెద్ద మొత్తాలు కోల్పోవలసి వస్తోందని కాగ్ (Comptroller and Auditor General of India) గతంలోనే హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రం పెద్ద మొత్తంలో అప్పులు సమీకరించింది.
తాజాగా కేంద్రం మరో 7 వేల కోట్లకు రుణ అనుమతులు ఇచ్చిందని సమాచారం. అందులోనూ దాదాపు 3 వేల కోట్లు వినియోగించేశారు. రాష్ట్రం ఇప్పటికే బహిరంగ మార్కెట్ రుణాల రూపంలో 47,950 కోట్లు రుణాలు తీసుకుంది. ఇవి కాకుండా కార్పొరేషన్ల ద్వారా దాదాపు 21,300 కోట్ల వరకు అప్పులు తీసుకుంది. నాబార్డు, ఉద్యోగుల పీఎఫ్.. ఇలా వివిధ రూపాల్లో వాడుకున్న మొత్తాలు ఇందుకు అదనం. ఈ స్థాయిలో అప్పులు తీసుకుంటూ కూడా రాష్ట్రం తరచూ ఓడీలోకి వెళ్తుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.