మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై సీబీఐ విచారణకు తమకు అభ్యంతరం లేదని వైకాపా స్పష్టం చేసింది. సీబీఐ విచారణతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని... సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. కోడెల ఆత్మహత్య వ్యవహారంలో ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ... ప్రజలను రెచ్చగొట్టేందుకు తెదేపా కుటిలయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
వివాదాస్పద సందర్భాలు సహా... బాంబు పెలుళ్లు వంటి క్లిష్ట పరిస్థితులనూ కోడెల ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదన్నారు. తెదేపా అవమానాల కారణంగానే ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్తెనపల్లిలోనే కోడెలను చంద్రబాబు దారుణంగా అవమానించారని ఆక్షేపించారు. కోడెల చావుకు చంద్రబాబు, ఆయన కుమారుడు, కూతురే కారణమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... నరసరావుపేటలో 144 సెక్షన్.. భారీగా బలగాల మోహరింపు