Amaravati Farmers Protest: ఆర్5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం పేరుతో సీఎం జగన్ పేదలను మోసం చేస్తున్నారని అమరావతి ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం పరిధి ఆర్5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతులకు శంకుస్థాపనకు సీఎం జగన్ నేడు శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని పరిధిలోని గ్రామాల్లో రైతులు నిరసనలకు దిగారు.
కృష్ణాయపాలెం, తుళ్లూరు దీక్షా శిబిరాల వద్ద నల్ల జెండాలు, నల్ల బెలూన్లతో ఆందోళన చేపట్టారు. ఆర్5 జోన్ అంశంపై హైకోర్టులో తీర్పు రిజర్వులో ఉన్నప్పటికీ ఇళ్ల నిర్మాణంపై జగన్ ముందుకు వెళ్తున్నారని.. కోర్టులంటే జగన్‌కు పట్టింపు లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, రైతుల రోడ్డు మీదకి రాకుండా ఉండేందుకు భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు.
అమరావతి రైతులను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆక్షేపించారు. ఓట్ల కోసమే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉన్నా శంకుస్థాపన చేయడం దారుణమని ఆగ్రహించారు. కోర్టులంటే సీఎం జగన్‌కు పట్టింపు లేదని దుయ్యబట్టారు. అమరావతి రైతులను కోర్టులకు తిప్పుతున్నారని ధ్వజమెత్తారు. ఏమీ చేయలేకపోతున్నామనే బాధగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతుల సమాధుల పై నుంచి ఎన్నికలకు వెళ్తున్నారని మండిపడ్డారు. సెంట్ భూమి పేరుతో అమరావతిలో స్థానికేతరులకు ఇళ్లు ఇవ్వడం సరికాదన్నారు.
సకాలంలో రైతులకు కౌలు, కూలీలకు పింఛను ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని.. ప్రభుత్వ వేధింపుల వల్ల 250 మంది రైతులు చనిపోయారని ధ్వజమెత్తారు. కాగా అగ్గిపెట్టెల్లా ఉన్నా ఇలాంటి ఇళ్లను తీసుకొని మోసపోవద్దంటూ బస్సులో సీఎం సభకు వెళుతున్న ప్రజలకు అమరావతి రైతులు చెప్పారు. మాలాగా.... 'మీరూ మోసపోవద్దు' నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు అగ్గిపెట్టె లాంటి ఇల్లు నిర్మించలేదని మండిపడ్డారు. సీఆర్డీఏ చట్టంలో అపార్ట్మెంట్లో నిర్మించి ఇవ్వాలని స్పష్టంగా ఉన్నా.. ఈ ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేయడానికి సిద్ధమయ్యారని చెప్పారు.
Janasena Leaders : రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో జనసేన పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి ఆళ్ల హరిని.. అమరావతి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా జనసేన నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆందోళనలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మరికొందరు జనసేన నేతలను గృహ నిర్బంధం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంగళగిరిలో భారీగా పోలీసులను మోహరించారు.