పవన్ మద్దతు కోరిన అమరావతి పరిరక్షణ సమితి అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ప్రతినిధులు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చిన పరిరక్షణ సమితి ప్రతినిధులు పవన్‌కు వినతిపత్రం అందజేశారు. శివరామకృష్ణన్ కమిటీ సూచనల మేరకే గత ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసిందన్నారు. ఇక్కడి చారిత్రక నేపథ్యం కూడా అందుకు దోహదం చేసినట్లు వివరించారు.
వేల కోట్లు రాజధాని నిర్మాణం కోసం వెచ్చించాక... ప్రభుత్వ ఉద్యోగులంతా ఇక్కడి నుంచే పనిచేయటం ప్రారంభించాక వేరేచోటికి రాజధాని తరలించటం సరికాదన్నారు. ఇప్పటికిప్పుడు 3 చోట్ల రాజధానులంటే అందుకు రూ.20 వేల కోట్లు అవసరమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వేరేచోటికి తరలివెళ్లటం కూడా కష్టమని వివరించారు. అందుకే అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని ఐకాస సభ్యులు స్పష్టంచేశారు. అమరావతి పరిరక్షణ సమితి సభ్యుల మాటల్ని సావధానంగా విన్న పవన్... రాజధాని ఒకేచోట ఉండాలనేదే తమ అభిప్రాయమని తెలిపారు.
ఇదీ చదవండి :
'అమరావతి రైతుల కోసం నా ప్రాణాలను అడ్డువేస్తా'