రాజధాని గ్రామాల్లో అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న పోరాటం 49వ రోజూ ఉద్ధృతంగా సాగింది. మందడంలో రైతులు, మహిళలు దీక్షల్లో పాల్గొన్నారు. ఇన్ని రోజులుగా తాము పోరాటం చేస్తుంటే కనీసం ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. దీక్షలో కూర్చున్న వారికి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మద్దతు పలికారు. అర్థరాత్రి పూట జీవోల ద్వారా కొన్ని కార్యాలయాలను కర్నూలు తరలించాలని ప్రయత్నించడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం మనసు మారాలని అమ్మకు పొంగళ్లు
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ మంగళగిరిలో ఆందోళనలు కొనసాగాయి. రిలే దీక్షల్లో రైతులు, మహిళలు పాల్గొనగా ప్రజాసంఘాల నేతలు మద్దతు పలికారు. ముఖ్యమంత్రి జగన్ మనసు మారాలంటూ ఎర్రబాలెంలో మహిళలు.. శ్రీలక్ష్మీ తిరుపతమ్మ తల్లికి పొంగళ్లు సమర్పించారు. గుడి వరకూ ర్యాలీగా వెళ్లి మొక్కులు చెల్లించారు. అమరావతి కోసం ఎన్ని రోజులైనా దీక్షలకు సిద్ధమని వెల్లడించారు. కృష్ణాయపాలెంలోనూ మహిళలు, రైతుల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
'ప్రభుత్వం కోర్టులను లెక్కచేయడం లేదు'
వెలగపూడిలో రైతులు చేస్తున్న దీక్షలకు పెద్దసంఖ్యలో మద్దతు లభిస్తుంది. దీక్షా శిబిరానికి వచ్చిన తెలంగాణ ప్రాంత రైతులు... మద్దతు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ సంఘీభావం తెలిపారు. న్యాయస్థానాలను కూడా ప్రభుత్వం లెక్క చేయడంలేదన్నారు. రైతుల దీక్షపై అజేయ కల్లం వ్యాఖ్యలను మహిళలు ఖండించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా.... తాము ఉద్యమం ఆపబోమని తెలిపారు.
మరో రైతు మృతి
మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో బుల్లబ్బాయి అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. కురగల్లులో అర ఎకరం పొలం రాజధాని కోసం ఇచ్చారు. రాజధాని తరలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలోనే మనస్తాపానికి గురై మరణించారన్న బంధువులు తెలిపారు. కొన్నిరోజులుగా అతను రైతుల ఆందోళనలో పాల్గొన్నారని వెల్లడించారు.