Amaravati farmers to Delhi: రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. వెయ్యి రోజులుగా పోరాటం చేస్తున్న రైతులు తమ గళాన్ని దిల్లీలో గట్టిగా వినిపించేందుకు పయనమయ్యారు. రాజధాని గ్రామాల్లో రిలే దీక్షలు, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర, అమరావతి నుంచి అరసవల్లి వరకు మహాపాదయాత్ర వంటి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించిన రైతులు.. ఇప్పుడు జాతీయస్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లాలనే లక్ష్యంతో హస్తిన బాట పట్టారు. విజయవాడ నుంచి గురువారం మధ్యాహ్నం ప్రత్యేక రైలులో దిల్లీకి బయల్దేరారు. రాజధాని గ్రామాలకు చెందిన సుమారు 15 వందల మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు, ఐకాస నేతలు దిల్లీ వెళ్లారు. శుక్రవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు.. ఈ ప్రత్యేక రైలు దిల్లీ చేరుకోనుంది.
సీఎం జగన్.. మూడు రాజధానుల ప్రకటన చేసి ఈనెల 17వ తేదీకి మూడేళ్లు పూర్తవుతున్న తరుణంలో.. అమరావతి రైతులు ఈ దిల్లీ యాత్ర చేపట్టారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ.. అన్ని పార్టీల ఎంపీలు, జాతీయ పార్టీల అధినేతలను కలిసి అమరావతి ఆవశ్యకతతో పాటు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామని రైతులు తెలిపారు.
అమరావతి రైతుల దిల్లీ యాత్రకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, రైతు సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దిల్లీలో రైతులు చేపట్టే కార్యక్రమాల్లోనూ పాల్గొని సంఘీభావం తెలుపుతామని నేతలు స్పష్టం చేశారు.
16వ తేదీ రాత్రి దిల్లీ చేరుకోనున్న అమరావతి రైతులు.. 17వ తేదీ ఉదయం 9నుంచి సాయంత్రం 4 గంటల వరకు జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నారు. 18వ తేదీన ఐకాస నేతలు, రైతులు.. బృందాలుగా విడిపోయి.. జాతీయ పార్టీల అధినేతలు, ఎంపీలను కలిసి రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వివరించనున్నారు. అమరావతి ఉద్యమానికి మద్దతు కోసం అభ్యర్థించనున్నారు. రాజధానిపై కేంద్రప్రభుత్వ వైఖరిని ప్రశ్నించనున్నారు.
ఇవీ చదవండి: