కరోనా వైరస్ ఆ కుటుంబాన్ని కుదిపేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ కుటుంబ యజమాని చనిపోయిన విషయం ఒకరోజంతా ఆ ఇంటివాళ్లకు తెలీదు. అప్పటివరకు ఇద్దరు కొడుకులు, కోడళ్లతో కళకళలాడిన ఆ కుటుంబంలో యజమాని భార్యకు కరోనా సోకింది. దీంతో ఆమెను ఐసొలేషన్‌కు తరలించారు. కొడుకులు, కోడళ్లను క్వారంటైన్‌కు పంపారు. అప్పటికే పక్షవాతంతో బాధపడుతున్న కుటుంబ యజమాని కంటైన్‌మెంట్ జోన్‌లో ఒంటరిగా ఇంట్లోనే ఉండిపోయారు. ఈనెల 2న మధ్యాహ్నం ఆయన కన్నుమూశారు.
ఈ విషయం కుటంబసభ్యులెవరికీ తెలియదు. పొరుగువారు స్థానిక నాయకులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులు, పురపాలక అధికారులకు తెలియజేసినా ఎవరూ స్పందించలేదు. ఒకరోజు గడిచినా కుటుంబ సభ్యులు రాకపోవడంతో స్థానికులు గట్టిగా అధికారులను నిలదీయగా.. క్వారంటైన్‌లో ఉన్న కుమారుడు, కోడలికీ ఈ విషయం తెలియజేసి ఒకరోజు వచ్చేందుకు అవకాశం కల్పించారు.
ఇంటికి వచ్చిన కుమారుడికి తండ్రి మృతదేహాన్ని తీయడానికి కూడా ఎవరూ సహకరించలేదు. ఆయన మహాప్రస్థానం వాహనం రప్పించారు. మోసేవారూ లేక.. డ్రైవర్ సహకారంతో కొడుకు, కోడలు వాహనంలోకి మృతదేహాన్ని చేర్చారు. ఇంతలోనే కరోనా పరీక్షలు చేయకుండా అంత్యక్రియలు నిర్వహించడానికి వీలు లేదంటూ పురపాలక అధికారులు అడ్డుకున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్తే... అక్కడ వాహనాన్ని లోపలకూ రానివ్వలేదు. మృతదేహాన్ని తిరిగి తాడేపల్లికి తీసుకొచ్చి స్థానికుల సహకారంతో దహనం చేశారు. భర్త భౌతికకాయాన్ని కడసారి చూసుకునేందుకూ భార్యకు అవకాశం లేకపోయింది.
ఇదీ చూడండి. ఇంత తక్కువ సమయంలో కరోనా టీకా ఎలా సాధ్యం