Gang Rape in Hyderabad: హైదరాబాద్ శివారు హయత్ నగర్ పరిధిలో బాలికపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. తోటి విద్యార్థులతో పాటు మరో బాలుడు బాలికపై అత్యాచారం చేస్తూ వీడియోలను తీసి వాటిని చూపి బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను జువెనైల్ హోమ్‌కి తరలించారు. అత్యాచార వీడియోలు స్థానిక కౌన్సిలర్ దృష్టికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా.. అమెతో పాటు అదే తరగతిలో మరో ముగ్గురు విద్యార్థులు చదువుతున్నారు.
చరవాణిలో ఎక్కువగా అశ్లీల వీడియోలు చూస్తున్న విద్యార్థులు బాలికపై కన్నేశారు. అమెతో ఉన్న చనువుతో విడతల వారీగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఆగస్టులో ఓ విద్యార్థి అత్యాచారం చేసి వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియోను స్కూలుతో సంబంధం లేని, అదే కాలనీలో ఉండే మరో స్నేహితుడికి పంపాడు. అతడు కూడా ఆ వీడియోను బాలికకు చూపి అత్యాచారం చేశాడు. అతను కూడా చరవాణిలో వీడియో రికార్డు చేశాడు. ఈ వీడియోలను అతని స్నేహితులకు పంపించాడు. ఇలా 12 మందికి ఈ వీడియోలను పంపారు.
తాజాగా వారం క్రితం మరో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు, తొమ్మిదో తరగతి చదివే మరో విద్యార్థి ఆమె ఇంటికెళ్లి వీడియోలను చూపించి అత్యాచారం చేశారు. తమ చరవాణిలో సైతం రికార్డ్ చేశారు. బాలికపై దారుణానికి ఒడిగట్టిన విద్యార్దులను కాలనీ వాసులు దేహశుద్ది చేశారు. అనంతరం హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారి అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం వారిని జువెనైల్ జస్టిస్ బోర్డులో హాజరుపరిచి జువెనైల్ హోంకి తరలించారు. వారి నుంచి 3 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. బాలిక స్టేట్ మెంట్‌ను రికార్డ్ చేసిన పోలీసులు ఆమెను వైద్యపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తలించారు. మైనర్లు తీసిన వీడియోలు ఎవరైనా షేర్ చేసినా, వైరల్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పోలీసులు. సంచలనం కలిగించిన ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
ఇవీ చదవండి: