YSRCP Leader Blocked Soil Transport: అత్యంత ప్రతిష్టాత్మకంగా నవరత్నాలు అమలుచేస్తున్నాం.పేదలందరికీ ఇళ్లు కట్టించి వారి సొంతింటి కల సాకారం చేస్తాం అంటూ ముఖ్యమంత్రి నుంచి స్థానిక ఎమ్మెల్యేల వరకూ వారి ప్రసంగాల్లో ఊదర గొడుతున్నారు. కాని వాస్తవ పరిస్థితి ఇందుకు ఏమాత్రం సరిపోలటం లేదు. జగనన్న కాలనీల్లో మెరక పనుల కోసమని మట్టిని తవ్వి తోలుకునేందుకు కలెక్టర్ అనుమతులు మంజూరు చేసినా వైసీపీ నాయకుడి ధన దాహంతో పనులు నిలిచిపోయాయి.
YSRCP Leader Demand to pay Money for Soil Moved to Layouts: ఏలూరు జిల్లా పరిధిలోని కొమడవోలు, చోదిమెళ్లలోని రెండు లే అవుట్లలో దాదాపు 6 వేల ఇళ్లకు మెరక, పునాదులు మట్టితో నింపాల్సి ఉంది. దీనికోసం జిల్లాలోని పెదవేగి మండలం నాగన్నగూడెం, దిబ్బగూడెంలో మట్టి తవ్వకాలకు జిల్లా కలెక్టర్ అనుమతులు మంజూరు చేశారు. ఈనెల 13న అధికారుల పర్యవేక్షణలో గుత్తేదారు తవ్వకాలు మొదలు పెట్టారు. ఒకరోజు తవ్వకాలు సాఫీగా సాగాయి. రెండో రోజు ఆ పరిధిలోని వైసీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. మా నాయకుడు ఆపేయమన్నారంటూ తవ్వకాలను అడ్డుకున్నారు. మట్టి తవ్వకాలకు అన్ని అనుమతులున్నాయని అక్కడ ఉన్న అధికారులు, సిబ్బంది చెప్పినా వారు వినిపించుకోలేదు.
Jagan Layout Soil Transport Stopped by YSRCP Leader: ఆ రోజు తవ్వకాలు నిలిపివేసిన సదరు గుత్తేదారు, సోమవారం మరోసారి తవ్వకాలు మొదలు పెట్టారు. అదే నాయకులు మళ్లీ వచ్చి పనులు అడ్డుకున్నారు. చెప్పినా వినకుండా మట్టితవ్వకాలు జరుపుతున్నారు కదా, దీన్ని ఎలా తరలిస్తారో చూస్తాం అంటూ బెదిరించడంతో చేసేది లేక గుత్తేదారు సంస్థకు చెందిన సిబ్బంది తమ వాహనాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఏలూరు జిల్లా పరిధిలోని సంబంధిత కాలనీల్లో మెరక పనులు చేసేందుకు అధికారుల అంచనా ప్రకారం 8వేల లారీల మట్టి తరలించాల్సి ఉంది. గుత్తేదారులు కలెక్టర్ అనుమతితో తవ్వకాలు చేస్తున్నా తనకు సమాచారం ఇవ్వలేదనే నెపంతో నియోజకవర్గంలోని వైసీపీ నాయకుడు తన వర్గాన్ని పంపించి పనులు ఆపించారని స్థానికులు చెబుతున్నారు. తవ్వకాలు జరగాలంటే ఒక్కో ట్రిప్‌కు రూ.500 చొప్పున ఇవ్వాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. మెుత్తం 8 వేల ట్రిప్పులకు రూ.40 లక్షలు కట్టాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకుని ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుకే మట్టి తరలిస్తున్నా అధికార పార్టీ నేత డబ్బులు డిమాండ్ చేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమీషన్ కోసం పేదల కాలనీలో మెరక పనులకు అధికార పార్టీ ఎమ్మెల్యే అడ్డుపడటంపై స్థానికులు ఆవేదన చెందుతున్నారు. కమీషన్ కోసం రాయబారాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.