ATTACK ON FOREST OFFICERS : ఏలూరు జిల్లాలో ఫారెస్ట్ అధికారులపై ఇద్దరు యువకులు మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు. అల్లంచర్ల-కొత్తగూడెంలోని అటవీ ప్రాంతంలో బుధవారం రోజు విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, అతని సహాయకులుగా పనిచేస్తున్న గంగరాజు, వైల్డ్ లైఫ్ బేస్ క్యాంప్ సిబ్బంది రాజేశ్‌పై ఏసు, ఎర్రమళ్ల ప్రశాంత్ అనే ఇద్దరు యువకులు మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు. అంతే కాకుండా క్యాంపులో ఉన్న టెంట్, కుర్చీలను ధ్వంసం చేసి సిబ్బందిని గాయపరచి చొక్కాలు చించేశారు. సిబ్బంది ప్రాణ భయంతో అక్కడ నుంచి పారిపోయారు. అనంతరం ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఆ తర్వాత టి.నర్సాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అసలెందుకు ఈ గొడవ: ఏలూరు జిల్లా టి. నర్సాపురం మండలం అల్లంచర్ల ప్రాంతంలో వందల ఎకరాల్లో అటవీ భూమి ఉంది. దశాబ్దం కిందట కొందరు రాజకీయ పలుకుబడితో భూమిని చదును చేసి, బోర్లు వేసి పంటలు పండించారు. తర్వాత కాలంలో అటవీ శాఖ అధికారులు అడ్డుకుని దీనిపై కోర్టులో కేసులు వేశారు. ప్రస్తుతం ఆ భూమిపై గొడవలు జరుగుతున్నాయి.
"మేము అడవిని కాపాడే క్రమంలో అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నాం. కొంతమంది గ్రామస్థులు అక్కడికి వచ్చి మాపై దాడికి ప్రయత్నం చేసి.. దుర్భాషలాడి కుర్చీలను విరగొట్టడం జరిగింది. ఈరోజు మాత్రం ఇద్దరు వచ్చి మాపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి ప్రయత్నించినా కుదరకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాము"-వెంకటేశ్వర్లు, అటవీ శాఖ అధికారి
13మందిపై కేసులు : అయితే మంగళవారం అటవీ శాఖ సిబ్బందిపై దాడి ఘటన సంచలనంగా మారటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. స్థానికంగా ఉన్న సత్యనారాయణతో సహా మరో 13 మందిపై కేసులు నమోదు చేశారు. తాజాగా మరో ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. అటవీశాఖ అధికారులు, పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. అటవీ భూముల దురాక్రమణ, దహనంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా పోలీసులు ఫారెస్ట్ భూములు వివాదంపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఆ భూమిపై ప్రస్తుతం గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే తమపై దాడులు చేశారని అటవీ సిబ్బంది ఆరోపిస్తున్నారు.
"అల్లంచర్లలో గత రెండు రోజుల నుంచి ఎండ తీవ్రతను తట్టుకోవడానికి అటవీ అధికారులు టెంట్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అధికారుల విధులకు ఆటంకం కలిగించి భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 14 మందిపై కేసులు పెట్టాం"-వెంకటేశ్వరరావు, సీఐ
ఎలాంటి గుడారాలు ఉండకూడదని, మళ్లీ గస్తీ నిర్వహిస్తే ఊరుకునేది లేదని వాగ్వాదానికి దిగి వారిపై దాడి చేసి గాయపరిచారని అటవీ శాఖ అధికారి సురేష్ తెలిపారు. ఈ దాడిలో బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు చేతిపై గాయం కాగా, సహాయకుడు గంగరాజు కాలిపై కత్తిగాయమైనట్లు, రాజేశ్ చొక్కాచింపినట్లు ఆయన వెల్లడించారు.
ఇవీ చదవండి: