Polavaram Project Guide Bund: పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న గైడ్‌బండ్‌ను ఏ.బి.పాండ్యా నేతృత్వంలో నిపుణుల కమిటీ గురువారం పరిశీలించింది. ఆకృతుల నుంచి నిర్మాణం తీరు తెన్నుల వరకు ఏయే లోపాలు కారణమై ఉండవచ్చన్న దానిపై లోతైన పరిశీలన జరిపింది. గైడ్‌బండ్ నిర్మాణంలో ఆలస్యం ఒక ప్రధాన కారణమై ఉండవచ్చనే అంచనాతో కమిటీ పరిశీలన చేపట్టింది.
పోలవరంలో స్పిల్‌వే గేట్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా వరద నీరు సాఫీగా సాగిపోయేందుకు వీలుగా దాదాపు 81కోట్లు వెచ్చించి గైడ్‌బండ్ నిర్మించారు. ఎంతో ముఖ్యమైన ఈ నిర్మాణం కుంగిపోవడంతో పాటు ఇందులో భాగంగా 500 మీటర్ల పొడవునా భూమి లోపల 5 మీటర్ల లోతు నుంచి పైకి 25 మీటర్ల ఎత్తు వరకు నిర్మించిన రిటైనింగ్ వాల్ సైతం పూర్తిగా ఒరిగిపోయింది. ఇది ఎంత మేర ఒరిగి ఉంటుందన్న దానిని కమిటీ పరిశీలించింది. ఇది పూర్తిగా లోపలి నుంచి ఒరిగినట్లే అని తేల్చింది. నిర్మాణంలో ఆలస్యమే గైడ్ బండ్ కుంగడానికి ప్రధాన కారణమై ఉండవచ్చని కమిటీ భావిస్తోంది.
గైడ్‌బండ్ నిర్మాణ షెడ్యూల్‌ను కమిటీ ఛైర్మన్ ఏ.బి.పాండ్యా ప్రాజెక్టు అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఒక సీజన్‌లోనే గైడ్‌బండ్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ఇక్కడ అలా జరిగలేదు. ఇక్కడ ఉన్న మట్టిని పరిగణనలోకి తీసుకుని స్టోన్ కాలమ్స్ తరహాలో భూమిని గట్టిపరిచి నిర్మాణం చేశారు. నిర్మాణ సమయంలో అక్కడ ఉన్న మట్టిని , వాటి పేరామీటర్లను పరీక్షించి వాటి ఆధారంగా పనులు చేపట్టారు. స్టోన్ కాలమ్స్ వేసే సమయంలో వరద వచ్చి తరువాత తగ్గింది.
ఈ దశలో వాటి మధ్య పోగుపడ్డ మట్టి వల్ల సమస్యలు తలెత్తి ఉండవచ్చన్న అంశంపైనా కమిటీ పరిశీలించింది. సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులను ఈ అంశంపై ప్రశ్నించగా గతంలో తాము ఎప్పుడూ ఇలాంటి అనుభవాన్ని చూడలేదని.. అలా జరిగే అవకాశాన్ని కొట్టి పారేయలేమని సమాధానం చెప్పినట్లు తెలిసింది. గైడ్‌బండ్ చుట్టూ ఉన్న మట్టిని సేకరించి మరోసారి పరీక్షలు చేయాలని పాండ్యా ఆదేశించారు. నిర్మాణానికి ముందు, ఆ తరవాత మట్టి నమూనాలలో తేడాలు ఉన్నాయా అన్నది తేల్చాలని భావించారు.
Polavaram guide bund damaged : కుంగిపోయిన పోలవరం గైడ్‌బండ్.. బాధ్యులెవరు..? భవిష్యత్ ఏమిటి?
గైడ్ బండ్ నిర్మాణం రిటైనింగ్ వాల్ తరహా కాగా..నిర్మాణం చేపట్టింది మాత్రం డయాఫ్రం వాల్ తరహాది. ఇది కూడా చర్చనీయాంశమవుతోంది. ఇలా ఎందుకు చేశారనేది కీలకంగా మారింది. భూమి లోపలి నుంచి పైకి సుమారు 1.5 మీటర్ల మందంలో 30 మీటర్ల ఎత్తు, 500 మీటర్ల పొడవుతో డయాఫ్రం వాల్ తరహా నిర్మాణం ఏమిటని.. రిటైనింగ్ వాల్ కోసం ఈ విధమైన నిర్మాణం ఏమిటనే చర్చ సాగుతోంది. ఇక్కడ ఆకృతుల అంశమూ చర్చనీయాంశమైంది. రిటైనింగ్ వాల్ జాయింట్లు లేకపోవడాన్నీ నిపుణులు ప్రస్తావించారు. గైడ్‌బండ్‌లో వాలు తక్కువగా ఉండటం.. ఎత్తు అధికంగా ఉండటం వల్ల భారం ఎక్కువైంది ఏమో అన్న కోణంలోనూ చర్చ జరిగింది.
ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతుల్లో ఈ తరహా మార్పులు చేయకపోయినా.. శాశ్వతంగా గైడ్‌బండ్ నిర్మాణ మార్పులు చేసే క్రమంలో ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుని ఆకృతులు ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం గైడ్‌బండ్ నిర్మాణం చేపట్టిన ప్రదేశానికి ఎడమ వైపున ఎగువ కాఫర్ డ్యాం వైపు ఎక్కువ ఖాళీ ఉందని అటు జరిపి నిర్మాణం చేపడితే మంచిదనే చర్చ కూడా జరిగింది. ఆ క్రమంలో గైడ్‌బండ్ మరికొంత వాలు పెంచి ఎత్తు తగ్గిస్తే మొత్తం మీద భారం తగ్గుతుందనే దానిపైనా చర్చించారు.
జులై నెల నుంచి గోదావరికి వరదలు రానున్నాయి. ఇక ఎక్కువ సమయం లేదు. ఈ లోపు కుంగిన గైడ్‌బండ్‌కు తాత్కాలికంగా అవసరమైన మరమ్మతులు చేసుకోవాలి. ఇందుకు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వచ్చే వరదలు సైతం ఈ గైడ్‌బండ్‌కు సవాల్ అని నిపుణులు అంటున్నారు.