Polavaram project Diaphragm wall : గోదావరి వరదలకు దెబ్బతిన్న పోలవరం డయాఫ్రం వాల్ సామర్థ్యం తేల్చేందుకు నిపుణులు రానున్నారు. ఈనెల 24న ఉన్నతాధికారులు పరిశీలించి నివేదిక అందజేయనున్నారు. గతేడాది సెప్టెంబరు నెలాఖరుకే ఈ పరీక్షలను పూర్తిచేసి నివేదిక సమర్పించాల్సి ఉంది. కానీ దిగువ కాఫర్ డ్యాంను రక్షిత స్థాయికి సరైన సమయంలో నిర్మించలేకపోవడంతో కిందటి వరద సీజన్లో పనులు చేసేందుకు వీలు పడలేదు.
డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తడంతో సమస్యలు ఎదురయ్యాయి. ఇప్పటికీ గోదావరి నీటిని పంపులతో తోడిపోస్తూనే మరోవైపు ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. ఎలక్ట్రోడ్ల ఏర్పాటు పూర్తి కావడంతో ..జాతీయ జల పరిశోధన కేంద్రం నిపుణులు ఈనెల 24న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణ నైపుణ్యం దేశీయ గుత్తేదారులకు లేకపోవడంతో అప్పట్లో విదేశీ కంపెనీ బావర్, ఎల్‌అండ్‌టీ సంయుక్తంగా పనులు చేపట్టాయి.
పోలవరం ప్రాజెక్టులోనే ఇది కీలక కట్టడం. గోదావరి గర్భంలో 90 అడుగుల లోతు నుంచి రాళ్లు ఎక్కడున్నాయో గుర్తించి అక్కడి నుంచి ఈ డయాఫ్రం వాల్ నిర్మించుకుంటూ వచ్చారు. ఇది ప్రధాన డ్యాం నిర్మాణ స్థలంలో దిగువ నుంచి ఊటనీరు ఒకవైపు నుంచి రెండోవైపు వెళ్లకుండా కట్టడి చేసి డ్యాం నిర్మాణానికి భద్రత ఇస్తుంది. ఈ కట్టడం 2020 భారీ వరదలకు దెబ్బతింది. దీంతో పోలవరంలో ఆ తర్వాత నిర్మాణ పనులన్నీ నిలిచిపోయాయి. ఆ వరదలకు డయాఫ్రం వాల్ ఏ మేరకు ధ్వంసమైంది. ధ్వంసమైన మేర నిర్మిస్తే సరిపోతుందా... లేక మొత్తం కొత్తగా నిర్మించాలా అన్నది తేల్చడమే ప్రస్తుత పరీక్షల ఉద్దేశం.
పోలవరంలో ప్రధాన డ్యాం నిర్మించే చోట 2 భాగాలుగా డయాఫ్రం వాల్ నిర్మించారు. మొదటి గ్యాప్‌లో 500 మీటర్ల మేర నిర్మించారు. ఇది ఇటీవలే నిర్మించడం వల్ల వరదలకు నష్టపోలేదు. ప్రధాన డ్యాం రెండో గ్యాప్‌లో 17 వందల 50 మీటర్ల మేర డయాఫ్రం వాల్ నిర్మించారు. అందులో దాదాపు 680 మీటర్లు ధ్వంసమైంది. ఈ రెండు భాగాల్లోనూ ఎన్‌హెచ్‌పీసీ పరీక్షలు నిర్వహించనుంది. హై రిజల్యూషన్ జియోఫిజికల్ రెసిస్టివిటీ ఇమేజింగ్ విధానం. సిస్మిక్ టోమోగ్రఫీ పరీక్షల ద్వారా డయాఫ్రం వాల్ సామర్థ్యాన్నిఎన్‌హెచ్‌పీసీ తేల్చనుంది. దీనికోసం 2120 ఎలక్ట్రోడ్లను ఏర్పాటు చేశారు.
సిస్మిక్ టోమోగ్రఫీ పరీక్షల కోసం ప్రతి 40 మీటర్ల గ్యాప్‌లో 60ఎంఎం డయా ఉండేలా బోరుగుంత తవ్వి పీవీసీ కేసింగ్ పైపు ఏర్పాటుచేశారు. ఈనెల 24న ఎన్‌హెచ్‌పీసీ డిప్యూటీ డైరెక్టర్, ఇద్దరు సహాయకులు ఏర్పాట్లను పరిశీలించి తగిన సూచనలు చేయనున్నారు. తర్వాత పూర్తిస్థాయి బృందం ఫిబ్రవరిలో వచ్చి పరీక్షలు జరపనుంది. వీరికి అవసరమైన పరికరాలను దిల్లీ నుంచి విజయవాడకు విమానంలో తెస్తారని సమాచారం.
ఇవీ చదవండి: