Kidney Rocket in Eluru: ఏలూరులో కిడ్నీ రాకెట్ దందా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్థిక అవసరాలతో ఉన్న మహిళలను లక్ష్యంగా
చేసుకుని ముఠా ఈ దందా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. ఈ ముఠా చేతిలో చిక్కుకొని ఓ మహిళ తన కిడ్నీ ఇచ్చింది. ఆమెకి ఇస్తామన్న డబ్బుల్లో మొత్తం ఇవ్వకుండా మోసం చేయడంతో ఆమె ఏలూరు వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దీంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏలూరు నగరంలో బావిశెట్టివారిపేటకు చెందిన బూసి అనురాధ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తుంది. ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆమె బాధ పడుతుంటే.. ఆ సమయంలో కే ప్రసాద్ అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు.. అతనితో తన కుటుంబ బాధలు చెప్పుకుని తనకు అప్పు ఇప్పించమని అడిగింది. అందుకు అతను కిడ్నీ ఇస్తే బోలెడు డబ్బులు వస్తాయని ఆశపెట్టి నమ్మించాడు. ఈ క్రమంలోనే ఏడు లక్షల రూపాయలకు ఉదయ్ కిరణ్ అనే వ్యక్తికి కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అనుకున్నట్లుగానే గత ఏడాది విజయవాడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. ఆ సమయంలో ఆమెకు ఇవ్వాల్సిన డబ్బుల్లో కేవలం ఐదు లక్షలు మాత్రమే ఇచ్చారని.. మిగిలిన డబ్బులు తనకు ఇవ్వకుండా మోసం చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
"కిడ్నీ ఇచ్చి మోసపోయానండి. నమ్మించి నన్ను మోసం చేశారు. ఉదయ్ కిరణ్ అనే వ్యక్తికి కిడ్నీ ఇచ్చాను. ప్రసాద్ అనే వ్యక్తి కిడ్నీ వ్యవహారం గురించి చెప్పాడు. నేను కూరగాయలు అమ్ముకునేప్పుడు పరిచయం అయితే.. నా బాధల గురించి చెప్పి.. అప్పు ఇప్పించమని అడిగితే కిడ్నీ అమ్ముకోవడం గురించి చెప్పాడు. సంవత్సరం క్రితం విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కిడ్నీ ఇచ్చాను. నా ఆధార్ కార్డ్‌లోని అడ్రస్ మార్చి.. అతని భార్యగా మార్చాడు. నాకు ఆ విషయం కిడ్నీ ఇచ్చేవరకు కూడా తెలియదు. 7లక్షలకు ఒప్పందం చేసుకుంటే 5లక్షలు ఇచ్చాడు."-అనురాధ, బాధితురాలు
ప్రస్తుతం తన ఆరోగ్యం కూడా బాగాలేదని తెలిపింది. తనకు సంబంధించిన ఆధార్ కార్డు ప్రూఫ్‌లను కూడా మార్చేశారని.. దాని వల్ల తనకు రావలసిన పింఛన్ డబ్బులు, ఇల్లు కట్టుకోవడానికి రావాల్సిన డబ్బులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు తెలిపింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. చట్టరీత్యా కిడ్నీ మార్పిడి జరగకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
"బూసి అనురాధ అనే మహిళ 2022వ సంవత్సరంలో కిడ్నీ మార్పిడి జరిగిందని మాకు సమాచారం వచ్చింది. కిడ్నీ మార్పిడి చట్టప్రకారం జరిగిందా లేకపోతే అక్రమంగా జరిగిందా తెలుసుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం"-ఆదిప్రసాద్, వన్‌టౌన్ సీఐ