Nuzvid Sub Registrar Office: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఇంకా సద్దుమణగకముందే.. ఏలూరు జిల్లా నూజివీడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు వెలుగు చూశాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్లు చేయాలంటే.. ముడుపులు ఇవ్వాల్సిందేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో 12 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా... వీటి పరిధిలో నిత్యం 800 వరకు వివిధ రకాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ అవినీతి జడలు విప్పిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ల ఫీజు, చలానా ఎంత కడతారో అంతే మొత్తం ముడుపుల కింద చెల్లిస్తేగాని పనులు జరగడం లేదు. ఏదో ఒక సాకు చూపిస్తూ నిలిపేస్తున్నారని.... స్థానికులు ఆరోపిస్తున్నారు. నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఫిర్యాదులు రావడంతో.... స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ జాయింట్ ఐజీ ఆకస్మిక తనిఖీలు చేశారు. దస్త్రాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, అవకతవకలు జరిగినట్లు గుర్తించామన్నారు. సబ్-రిజిస్ట్రార్ మాత్రం అసలు ఇక్కడ ఎలాంటి అవినీతి జరగడం లేదని... అంతా సవ్యంగానే ఉందని చెబుతున్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చేవారు రిజిస్ట్రేషన్లు సొంతంగా చేసుకునేలా పబ్లిక్ డేటా ఎంట్రీ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినా అది ఎక్కడా కనిపించడంలేదు. ఎవరైనా ఈ విధానంలో తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రయత్నించినా సిబ్బంది సరైన సూచనలు చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి: