Chintamaneni: తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకూ కేసు నమోదు చేయలేదని ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని ప్రశ్నిస్తున్న తమలాంటి వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా పోలీసు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి మాట్లాడాడని.. తనను చంపుతారనే సంకేతాన్ని ఆ వ్యక్తి మాటల ద్వారా వ్యక్తం చేశారన్నారు. అతని ఫోన్ నంబరు తెలియజేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకూ ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. కొద్దిరోజుల కిందట తన ట్రాక్టరును ఓ లారీ ఢీకొనడంతో పాడైందని.. దాన్ని బాగు చేయించేందుకు లారీకి సంబంధించిన వ్యక్తి తన బ్యాంకు ఖాతాలో కొంత సొమ్ము జమ చేశారన్నారు. ఆ వ్యక్తిని తాను బెదిరించి సొమ్ము పొందినట్లు పోలీసులు చిత్రీకరించాలని యత్నించారని చింతమనేని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కొందరు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగించాలని చూస్తున్నారన్నారు.
ఇవీ చదవండి: