CBN FIRES ON CM JAGAN : వివేకా హత్య కేసు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ కావడం సీఎం జగన్‌కు చెంపదెబ్బ వంటిదన్నారు. వివేకా కేసును నీరుగార్చడానికి అన్ని ప్రయత్నాలూ చేశారని సుప్రీంకోర్టే చెప్పిందని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా విజయరాయిలో పర్యటించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు 'ఇదేం ఖర్మ- మన రాష్ట్రానికి' బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు. బహిరంగ సభ వేదికగా సీఎం జగన్, వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బాబాయిని చంపి అబద్ధాలు అల్లిన జగన్‌కి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నది ప్రజల డిమాండ్ అని తెలిపారు. వైసీపీ గెలిస్తే మనకు రాజధాని అమరావతి ఉండదని స్పష్టం చేశారు.
సునీత పొరాటాన్ని ప్రశంసించాలి: సొంత బాబాయిని చంపిన వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్నారు. వివేకా కుమార్తె సునీత పోరాటాన్ని ప్రశంసించారు. తండ్రి హత్య కేసుపై సుప్రీంకోర్టు వరకూ సునీత చేసిన పోరాటాన్ని అంతా అభినందించాలన్నారు. తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడాలని వైఎస్ సునీత పోరాడుతోందని తెలిపారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి.. ఆపై బెదిరిస్తున్నారని ఆరోపించారు.
మరోసారి వైసీపీని గెలిపిస్తే రాష్ట్రానికి అవే చివరి ఎన్నికలు: బాబాయ్‌ని చంపినంత సులువుగా తననూ చంపొచ్చని జగన్ అనుకుంటున్నారని.. ఇప్పుడు లోకేశ్‌ని లక్ష్యంగా చేసుకున్నారని.. వైసీపీ తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి వస్తే విధ్వంసం తప్పదని తాను ఆనాడే హెచ్చరించానని చంద్రబాబు గుర్తుచేశారు. అందుకే ఇప్పడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానన్నారు. మరోసారి వైసీపీను గెలిపిస్తే.. అవే రాష్ట్రానికి చివరి ఎన్నికలంటూ చంద్రబాబు జోస్యం చెప్పారు.
"నేడు వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేయడం.. ఇది ముఖ్యమంత్రికి చెంపదెబ్బ లాంటిది. వివేకా తీర్పుపై జగన్ సమాధానం చెప్పాలి..లేకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. అసలు జగన్‌కి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నా"-చంద్రబాబు
రివర్స్ టెండర్ చేపట్టి పోలవరాన్ని సర్వనాశనం చేశారు: వైసీపీ గెలిస్తే పోలవరాన్ని ముంచేస్తారని తాను ఆనాడే చెప్పినట్లు గుర్తు చేశారు. సోమవారాన్ని పోలవరంగా మార్చి.. ప్రాజెక్టును పరిగెత్తించినట్లు తెలిపారు. తమ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తయ్యాయని.. వైసీపీ రాగానే ప్రాజెక్టు రివర్స్ టెండర్ చేపట్టి గోదావరిలో కలిపారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును నాశనం చేశారని.. పోలవరం పూర్తయితే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయని తెలిపారు.
అధికారంలోకి వస్తే.. సంక్షేమ పథకాలు మరింత మెరుగ్గా అమలు: ప్రజలు నేరస్థుడి చేతికి పాలన అప్పగించారన్న చంద్రబాబు.. రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలూ సంతోషంగా లేరని చెప్పారు. ప్రజల మెడ మీద కత్తి పెట్టి సర్వం దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను ఆపేస్తారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. రాష్ట్ర సంపదను పెంచి... సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా అమలుచేస్తామని హామీ ఇచ్చారు.
మీటర్లు పెట్టి రైతుల మెడలో ఉరితాళ్లు: రాష్ట్రంలో రైతుల నెత్తిన రూ.2.7 లక్షల తలసరి అప్పు ఉందని.. మీటర్లు పెట్టి రైతుల మెడలో ఉరితాళ్లు వేస్తున్నారని ధ్వజమెత్తారు. మూడున్నరేళ్లుగా అమాయకులను అరెస్టు చేస్తున్నారన్న బాబు.. జగన్‌కి పోలీసులు ఉంటే తనకు ప్రజలు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా.. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలని.. కార్యకర్తలు, నాయకులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
"నా బాధ, ఆవేదన అంతా రాష్ట్రం కోసమే. అధికారంలో ఉన్నప్పుడు నెలకొసారి పోలవరానికి వెళ్లి.. ప్రాజెక్టును పరిగెత్తించా. టీడీపీ హయాంలో 72శాతం పనులు పూర్తయ్యాయి. కానీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తెల్లారే రివర్స్ టెండర్ విధానం తీసుకొచ్చి పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. మూడున్నరేళ్లలో 72 శాతం పనులు పూర్తైతే, అదే మూడున్నర సంవత్సారాల్లో డయాఫ్రమ్ వాల్‌ను ఇంతవరకు బాగు చేయలేదు. అక్కడి నిర్వాసితులకు పునరావాసాలు, ప్యాకేజీ, ఆర్ అండ్ ఆర్ ఇవ్వలేదు. పోలవరం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు.. దీని నిర్మాణానికి డబ్బులు కూడా కేంద్రమే ఇస్తుంది"-చంద్రబాబు
ఇవీ చదవండి: