ఏలూరు జిల్లాలోని జీలకర్ర గూడెంలో గుంటుపల్లి గుహలు సౌందర్య చిహ్నాలుగా, చారిత్రక సాక్ష్యాలుగా నిలిచాయి. ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధమతం విరాజిల్లిందని చాటుతున్నాయి. ఇవి బౌద్ధమత ఆరంభ కాలం నాటి ఆరామాలని చెబుతారు. ఇక్కడి పెద్ద స్తూపం (ధర్మలింగేశ్వరాలయం) చుట్టూ రాతి మెట్ల ప్రదక్షిణ మార్గం ఉంది. ఇసుక రాతి కొండను తొలిచి ఏర్పాటు చేసిన చిన్న చిన్న గదుల్లో బౌద్ధ భిక్షువులు నివాసముండేవారట.
కొండ కింద ఉన్న ప్రాంతాన్ని పెద్ద బౌద్ధారామంగా, కొండ మీద గల ఐదు గదుల సముదాయాన్ని చిన్న బౌద్ధారామంగా పిలుస్తారు. మొక్కు స్తూపాలుగా పిలిచే ఇక్కడి 60కి పైగా స్తూపాలను కోరిన కోరికలు తీర్చినందుకు ప్రతిఫలంగా నిర్మించారని చెబుతారు. బౌద్ధభిక్షువుల సమావేశ మందిరం, వృత్తాకార స్తూప చైత్యం, రాతి ఫలకాలతో ప్రాచీన వైభవాన్ని చాటుతుందీ ప్రాంతం. ‘ఆంధ్రా అజంత’గా గుర్తింపు పొందిన ఈ గుంటుపల్లి గుహలకు వెళ్లేందుకు ఏలూరు నుంచి బస్సు మార్గం ఉంది. గోపన్నపాలెం, పెదవేగి, కూచింపూడి మీదుగా జీలకర్ర గూడెం చేరుకోవచ్చు.
ఇదీ చదవండి: