Brothers died with electric shock: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. పొలం వద్దకు వెళ్తున్న సోదరులు విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నాదమ్ములు.. ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుల్లో ఒకరు ఇంజినీరింగ్ పూర్తి చేసుకోగా.. మరో యవకుడు ఇంకా చదువుతున్నాడు. చేతికందివచ్చిన కుమారులిద్దరూ మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా మారింది.
తెల్లవారుజామున పాలు తీయడానికి పొలం వెళుతుండగా.. మార్గమధ్యలో 11 కేవీ విద్యుత్ వైరు తెగి ద్విచక్ర వాహనంపై పడడంతో మంటలు చెలరేగాయి. దీంతో ద్విచక్ర వాహనంతో పాటు 21 ఏళ్ల వల్లేపల్లి నాగేంద్ర, వల్లేపల్లి ఫణీంద్ర సజీవ దహనమయ్యారు. తమ దారిన తాము వెళ్తున్నవారిపై.. విద్యుత్ తీగలు తెగిపడి చనిపోవడాన్ని బంధువులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా.. ఇది పూర్తిగా విద్యుత్ శాఖ నిర్లక్ష్యమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో విద్యుత్ తీగల సమస్య ఉందని ఆ శాఖ అధికారులు చెప్పినా.. స్పందించలేదని స్థానికులు మండి పడుతున్నారు.
ఇవీ చూడండి: