తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన రాష్ట్ర స్థాయి థాయ్ బాక్సింగ్ పోటీల్లో విశాఖజిల్లా నర్సీపట్నం నింజా అకాడమీకి చెందిన నలుగురు క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకుని పథకాలు కైవసం చేసుకున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన హర్షవర్ధన్ అండర్-17లో 50 కిలోల విభాగంలోనూ, అండర్-17 బాలికలలో కొలుకుల కృష్ణవేణి 65 కేజీల విభాగంలోనూ, అండర్-15లో దంతు మౌనిక 69 కిలోల విభాగంలో బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు.
అండర్-17 బాలికల విభాగంలో దమ్ముల రాజేశ్వరి 65 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించి ప్రతిభ చాటారు. వీరంతా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న జాతీయ థాయ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికైనట్లు టీం కోచ్ జగన్నాథం తెలిపారు.
విజేతలను నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, నింజా అకాడమీ ఛైర్మన్ నారాయణరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ నర్సీపట్నానికి బాక్సింగ్ రింగ్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ద్వారా కేలో ఇండియా సెంటర్ వచ్చేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చదవండి: బళ్లారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి