వాళ్లు కర్ర తిప్పితే.. పతకాలు రాలాల్సిందే! - gold medals
అప్పుడెప్పుడో వచ్చిన రైతుబిడ్డ సినిమా నుంచి ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కర్రసాముతో ఆకట్టుకున్న సినిమాలు చాలానే. అయితే మార్షల్ ఆర్ట్స్‌కు స్ఫూర్తిగా నిలిచిన ఈ క్రీడ ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితి. ఈ సంప్రదాయ విద్య కాపాడుకోవాలనే కొంతమంది ఆలోచతో..మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తోంది.
ఇప్పుడంటే ఆధునిక మారణాయుధాల వాడకం పెరిగింది కానీ... ఒకప్పుడు కర్రసాము తెలిస్తే అదే గొప్ప. కర్ర తిప్పితే..ఎంతటి మెునగాడైనా..భయపడాల్సిందే. ఆత్మరక్షణతోపాటు ఆరోగ్యాన్ని అందించే...ఈ ప్రాచీన విద్య కనుమరుగవుతోంది. ఆ కళ కాపాడుకోవాలనే తపనే పతకాల పంట పండిస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా కరప మండలంలోని వేళంగి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు కర్రసాములో మేటి. నిరంతర సాధనతో సంప్రదాయ క్రీడలో రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. ఆర్‌ఎంఎస్‌ఏలో భాగంగా వ్యాయామ ఉపాధ్యాయురాలు చాందినీ శిరీష చొరవతో 40మందికి కర్రసాము నేర్పిస్తున్నారు. ఆరు నెలల నుంచి క్రమం తప్పకుండా శిక్షకుడు లోవరాజు తర్ఫీదునిస్తున్నారు. తక్కువ సమయంలోనే విద్యార్థులు కర్రసాములో మెళకువలు నేర్చుకుని అద్భుతంగా రాణిస్తున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని 5 పసిడి, 4 వెండి పతకాలు దక్కించుకున్నారు. తమిళనాడులో జరిగిన 11వ జాతీయ స్థాయి పోటీల్లో ఓ వెండి పతకం, కాంస్య పతకం సాధించారు.
విద్యార్థులు ఎంతో ఆసక్తిగా కర్రసాము నేర్చుకుంటున్నారని శిక్షకుడు లోవరాజు చెబుతున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లలను ప్రోత్సహించాలని... అప్పుడే ఈ కళ ముందు తరాలకు అందుతుందని అభిప్రాయ వ్యక్తం చేశారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు వ్యాయామ ఉపాధ్యాయురాలు చాందినీ శిరీష ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు.
గతేడాది పదో తరగతి ఫలితాల్లో వేళంగి జడ్పీ ఉన్నత పాఠశాల జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. 53మంది విద్యార్థులు పదికి పది జీపీఏ సాధించారు. చదువుతోపాటు క్రీడల్లోనూ అద్భుతంగా రాణిస్తూ ఈ విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు.