తూర్పు గోదావరి జిల్లా దోసకాయలపల్లిలో గుర్తు తెలియని దుండగులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. డీఎస్పీ వెంకటేశ్వరరావుతో పాటు మాజీ మంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రశాంత వాతావరణం నెలకొన్న రాజానగరం నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరగటం బాధాకరమని జవహర్ అన్నారు. దోషులును అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేవాలయాలపై దాడులు జరిగినా.. అధికార పార్టీ స్పందించలేదని విమర్శించారు. నేడు ప్రజలు ఎంతో గౌరవించే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినవారిని పట్టించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ ఘటనను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. "మూర్ఖత్వానికి మానవ రూపం జగన్ రెడ్డి. మహనీయుల విగ్రహాలు కూలుస్తూ మరింత దిగజారిపోయారు. దేవతా విగ్రహాలు ధ్వంసం చేసిన వైకాపా గ్యాంగ్ ఇప్పుడు మహనీయుల విగ్రహాలపై పడింది" అని లోకేశ్ అన్నారు. విగ్రహం పడగొడితే చెరిగిపోయే చరిత్ర కాదు నందమూరి తారకరామారావుది అని వ్యాఖ్యానించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైకాపా గ్యాంగ్‌ని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ.. 'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ'పై.. కార్మికుల ఆందోళన