Womans nude call case incident: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జోగులాంబ గద్వాల జిల్లాలో నగ్నవీడియో కాల్స్ కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న వినోద్, నిఖిల్‌ను అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేస్తున్నట్లు జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా కేసు పూర్వపరాలను ఆయన వివరించారు.
మహిళల నగ్న దృశ్యాల వ్యవహారంపై మీడియాలో వచ్చిన ఆరోపణలపైనా ఎస్పీ స్పందించారు. ఈ వ్యవహారం పట్టణ ఎస్సై దృష్టికి వచ్చిన వెంటనే దర్యాప్తు ప్రారంభించారని, విచారణ కొనసాగుతుండగానే ఫోటోలు బైటకు వచ్చాయని ఎస్పీ వివరించారు. ఓ వ్యక్తి ఫోన్లో ఉన్న వ్యక్తిగత సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా బహిర్గతం కావడం వల్ల ఇలా జరిగిందని, మీడియాలో వస్తున్నట్లుగా దీని వెనక ముఠాల్లాంటివి ఏవీ లేవని స్పష్టం చేశారు.
ప్రస్తుతం మహేశ్వర్ రెడ్డి ఫోన్లో ఉన్న మహిళల వ్యక్తిగత సమాచారం ఎవరెవరికి పంపారనే వివరాలు తెలుసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు. ఈ వ్యవహారంలో మహిళల నగ్న, అర్థ నగ్న ఫోటోలు ఎవరికైనా వస్తే వాటిని వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేశారు. బాధితులెవరూ ఇప్పటి వరకూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ ఫొటోల ఆధారంగా ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసినా, బెదిరించినా, డబ్బులు వసూలు చేసిన పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు బలంగా మారుతుందని, తగిన రక్షణ, గోప్యత కల్పించి బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.
అసలేం జరిగింది: తెలంగాణలోని గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అలియాస్ తిరుమలేష్ ఓ విందులో అతిగా మద్యంసేవించి పడిపోయాడు. ఆ సమయంలో అతనితోపాటే ఉన్న నిఖిల్, మహేశ్వర్ రెడ్డి ఫోన్లో రికార్డు చేసుకున్న వీడియోకాల్స్ తెరచి ఆ దృశ్యాలను ఫొటోలు తీసుకున్నాడు. వాటిని స్నేహితుడైన వినోద్‌తో పంచుకున్నాడు. వినోద్ మరో ఐదుగురు స్నేహితులకు షేర్ చేయబోయి ఫోన్లో ఉన్న కాంటాక్టు నంబర్ల అన్నింటికీ ఆ ఫొటోలు షేర్ చేశాడు. అలా చాలామందికి వెళ్లిన ఫొటోలు గద్వాల పట్టణంలోని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మీడియా ద్వారా విషయం బైటకు పొక్కడంతో పోలీసులూ దీనిపై దృష్టి సారించారు.
ఇవీ చదవండి: