Balineni Srinivasa Reddy Comments : వైఎస్సార్సీపీ నాయకుడు చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి తనపై చేసిన విమర్శలను జనసేన నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి కూడా తనను విమర్శించే వాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అయిదేళ్ల పరిపాలనపై చర్చించేందుకు చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి ముందుకు వస్తే తాను సిద్ధమని బాలినేని సవాల్ విసిరారు. తాను విలువలు లేని రాజకీయాలు చేయనని బాలినేని స్పష్టం చేశారు. జనసేన పార్టీలో చేరినప్పుడే తాను ఎవరినీ విమర్శించనని, తనను విమర్శిస్తే చూస్తూ ఊరుకోనని, వాస్తవాలు చెప్పాల్సి వస్తుందని స్పష్టం చేసినట్లు తెలిపారు.
వైఎస్సే నాకు రాజకీయ బిక్ష పెట్టారు: విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో రూ.1750 కోట్లు లంచం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయని, అప్పట్లో తాను విద్యుత్ మంత్రిని అయినందునే అప్పట్లో ఏమి జరిగిందో చెప్పడం తప్పా అని ప్రశ్నించారు. వైఎస్సే రాజకీయ బిక్ష పెట్టారని జనసేనలో చేరినప్పుడే చెప్పానన్న బాలినేని, రాజశేఖర్ రెడ్డి కుటుంబం వల్లనే తాను పైకి వచ్చినట్లు మరోసారి వెల్లడించారు. అందులో అనుమానం లేదని తెలిపారు. వైఎస్ మృతి చెందినప్పుడు ఆయనపై ఉన్న అభిమానంతోనే మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవిని వదులుకొని వైఎస్సార్సీపీలో చేరినట్లు స్పష్టం చేశారు.
వైఎస్ కుటుంబం అంటే ఒక్క జగనేనా?: వైఎస్ కుటుంబం అంటే జగన్ ఒక్కరే కాదు కదా అని ప్రశ్నించిన ఆయన, వై.ఎస్. విజయమ్మ, షర్మిల వైఎస్ కుటుంబం కాదా అని నిలదీశారు. షర్మిల, విజయమ్మపై పోస్టులు పెడితే జగన్ పట్టించుకోరా అని మండిపడ్డారు. తాను వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎవరూ తట్టుకోలేరని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నుంచి బయటకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో మొత్తం చెబుతానని, ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ చేశారు.
నేరుగా జగన్‌నే ప్రశ్నిస్తున్నా: సెకీతో ఒప్పందం గురించి తనకు తెలియదని చెప్పకుండా ఆ ముడుపుల్లో తనకు కూడా వాటా ఉందని చెప్పాలా అని మండి పడ్డారు. సీఎండీ రూపొందించిన దస్త్రం కూడా తన వద్దకు రాలేదన్న బాలినేని, సంతకం పెట్టాలని అర్ధరాత్రి పంపారని, తాను పెట్టలేదని మరోసారి స్పష్టం చేశారు. సెకీ ఒప్పందంపై తనతో ఎప్పుడైనా మాట్లాడారా అని జగన్‌నే ప్రశ్నిస్తున్నానన్నారు.
ఒంగోలులో పోటీచేసే నాయకుడే లేరా: చంద్రబాబు, పవన్ మెప్పు కోసమే మాట్లాడుతున్నానంటున్నారని, ఎవరి మెప్పు కోసమో తాను పనిచేయట్లేదని చెవిరెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు. తిట్టేవాళ్లకే టికెట్లిస్తామనే సంప్రదాయం ఎవరిదో అందరికీ తెలుసని బాలినేని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా అధ్యక్షుణ్ని తీసుకొచ్చి ఒంగోలు టికెట్ ఇస్తారా అని మండిపడ్డారు. ఒంగోలులో నాయకులే లేరని చిత్తూరు జిల్లా నుంచి తెచ్చారా అని ప్రశ్నించారు. చిత్తూరు నుంచి తీసుకొచ్చి ఒంగోలులో నిలబెట్టడం తనకు నచ్చలేదని అన్నారు.
తనను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చాలా మర్యాదగా చూసుకుంటున్నాడన్నారు. పవన్ వెంట ఉండి కూటమితో కలిసి పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు. తనకు విద్యుత్తు ఒప్పందాలతో సంబంధం ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. విద్యుత్తు సీఎండీలకు ఏదైనా చెప్తే కాంట్రాక్టర్‌కు ఒక మాట చెప్పాలని చెప్పేవారని, మంత్రిగా తనకు విలువ లేదని ధ్వజమెత్తారు. తాను వ్యక్తిగత విమర్శలు చేయనని, మొదలు పెడితే ఎవరూ తట్టుకోలేరని హెచ్చరించారు.
జగన్ పాత్ర నిజమే అయితే క్షమించరానిది - మంత్రిగా చేసినందుకు బాధపడుతున్నా: బాలినేని