మంత్రి మల్లాడి ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా ఆయన ఆశ, శ్వాస, ఆలోచన అన్నీ యానాం అభివృద్ధి గురించేనని.. పట్టుదల అంకితభావం ఉన్న ఇలాంటి నాయకులు రాజకీయాల్లో తప్పనిసరిగా కొనసాగాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణసామి అన్నారు. బుధవారం రాత్రి యానాంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావుకు ఉత్తమ శాసనసభ్యుడు పురస్కారం, ఓటమి ఎరుగని ఎమ్మెల్యేగా రజతోత్సవ పురస్కారం కింద పాతిక బంగారు కాసులతో జ్ఞాపిక స్పీకర్ శివకొళుందుతో కలిసి అందజేశారు. ఎప్పుడూ చేతిలో దస్త్రంతో సమస్యల పరిష్కారానికి తిరిగే మల్లాడి ప్రజాప్రతినిధిగా దొరకడం యానాం ప్రజల అదృష్టమన్నారు.
మల్లాడి రాజకీయాల్లో కొనసాగాల్సిందే: తమ్మినేని
ఈ సభకు హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ విలువలు కలిగిన రాజకీయ నాయకులు ప్రస్తుత వ్యవస్థలో కరవయ్యారని, మల్లాడిలాంటి వారు రాజకీయాల్లో కొనసాగాల్సిందేనన్నారు. ప్రజల కోసం అవిశ్రాంతంగా పని చేస్తున్న వ్యక్తిగా కొనియాడారు. ఏపీ సీఎం తరఫున మంత్రి మల్లాడి కృష్ణారావుకి మెమెుంటోను అందజేశారు.
సభలో తొలుత ముఖ్యమంత్రి వి.నారాయణసామి జ్యోతి వెలిగించి యానాం ప్రజా ఉత్సవాల్ని లాంఛనంగా ప్రారంభించారు. సభలో పుదుచ్చేరి మంత్రులు , ఏపీ మంత్రులు పాల్గొన్నారు.
సభలో మల్లాడి జీవిత చరిత్రపై రూపొందించిన బయోపిక్ ‘గౌతమి పుత్ర మల్లాడి’ని ఏపీ స్పీకర్ తమ్మినేని.. ‘ఇట్లు మల్లాడి కృష్ణారావు’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి నారాయణసామి ఆవిష్కరించారు.
మల్లాడికీ పద్మశ్రీ ఇవ్వాలి: పుదుచ్చేరి సీఎం
రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మల్లాడికి.. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇవ్వాలని కోరుతూ సిఫార్సు చేస్తున్నట్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు.
ఇదీ చదవండి: 'జగనన్న కాలనీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం'