తూర్పు, పశ్చిమ తీరాలను అన్నపూర్ణగా మార్చిన ఘనత గోదావరిది. ఉభయ జిల్లాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ముఖ చిత్రాన్ని మార్చేసింది. అయితే... ఇంతటి ఘనమైన గోదారమ్మ పంట కాల్వలను మనం అంతే పవిత్రంగా కాపాడుకోవటం లేదనేది జగమెరిగిన సత్యం. గౌతమీ తీరంలో కనిపించే దృశ్యాలు రాబోయే అనర్థానికి నిలువెత్తు నిదర్శనం. డ్రైనేజీలు సైతం ఆ పంట కాల్వల ముందు దిగదుడుపే అనేది కలచివేసే చేదు నిజం.
ఆ పవిత్ర తీరం...
రాజమహేంద్రవరం దిగువున అఖండ గోదావరి ఏడు పాయలుగా చీలి పోతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడ కెళ్లినా ఈ జలాలే దర్శనమిస్తాయి. వందల కిలోమీటర్ల మేర పంట కాల్వలు, ఉప కాల్వలు, పిల్ల కాల్వలు, బోదెలు ప్రవహిస్తూ జలాలకు ఈ ప్రాంతాలు చిరునామానేమో అనిపిస్తుంది. ఒకప్పుడు కాలువల్లోనే దోసెడు నీళ్లు తీసుకుని తాగేవాళ్లు. కొన్ని చోట్ల నీళ్లు కోనసీమ గంగా బొండాలను తలపించేటంత తీయగా ఉండేవి. కేవలం మూడు, నాలుగు దశాబ్ధాల్లోనే ఈ దృశ్యం మారిపోయింది. ఆ పవిత్ర తీరం ఇప్పుడు కనుమరుగై పోయింది.
కాలుష్య కోరల్లో...
ధవళేశ్వరం బ్యారేజీ ఎగువన అఖండ గోదావరి కాలుష్యం కోరల్లో చిక్కుకుంటోంది. రాజమహేంద్రవరం నగరంలోని డ్రైనేజీ నీటిని శుద్ధి చేయకుండానే నల్లా ఛానల్ నుంచి గోదావరిలో కలిపేస్తున్నారు. శ్మశాన వాటికల్లో మృతదేహాలు దహనం చేసిన తర్వాత బూడిద నేరుగా గోదావరిలోకే చేరుతోంది. ఇక పరిశ్రమల వ్యర్థాలకు కేరాఫ్ అడ్రస్ చెప్పనక్కర్లేదిక..!?
గరళ గోదావరి...
కాలుష్యం కాటన్ బ్యారేజీని దాటుకుని రెండు గోదావరి జిల్లాల్లోని పంట కాలువల్లోకి ప్రవహిస్తోంది. డ్రైనేజీ నీరు, జీవుల కళేబరాలు, మాంసపు దుకాణాలు, ఆస్పత్రులు, పరిశ్రమల్లోని వ్యర్థాలు, ఇళ్లు, నగరంలోని మురుగు, పల్లెల డ్రైనేజీలు నేరుగా ఈ పంట కాలువల్లోకి చేరుతున్నాయి.
సాగుకు పెను సవాల్...
ఒకప్పుడు తీర ప్రాంతానికే పరిమితమైన ఆక్వా సాగు... ఇప్పుడు డెల్టా ఎగువ మండలాలకూ విస్తరించింది. తీపి, ఉప్పు నీటి సమ్మేళనం కోసం భూగర్భంలో చాలా లోతుగా తవ్వుతున్నారు. పెద్ద ఎత్తున రొయ్యలు సాగు చేస్తున్నారు. మందులు ఎక్కువగా వాడుతున్నారు. సాగు తర్వాత ఆ నీటిని పక్కనే ఉన్న పంట కాలువల్లోకి వదిలేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో వ్యవసాయం పెను సవాల్‌గా మారే ప్రమాదం ఉంది.
"కొబ్బరి నీళ్లను తలపించే జలం.. నెత్తిన చల్లుకున్నంతనే పాపాలు హరించుకుపోతాయని భక్తులు విశ్వసించే పవిత్రోదకం... నేడు కాలకూట విషంగా మారుతోంది."
ఇదీ చదవండీ: గోదారమ్మ ఉగ్రరూపం... అన్నదాతకు శాపం