టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నదే ఆమె లక్ష్యం. దీనిని సాధించే దిశగా పట్టుదలతో నిరంతర సాధన చేస్తూ విజయపథంలో దూసుకెళ్తున్నారు భీమవరం యువతి తటవర్తి శ్రేయ. భీమవరం యూత్‌క్లబ్‌లో 2015లో జరిగిన జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నీలో సత్తాచాటిన ఈమె ప్రస్తుతం ప్రపంచ విశ్వవిద్యాలయాల టెన్నిస్ టోర్నీ కోసం సిద్ధమవుతోంది.
భీమవరం పట్టణానికి చెందిన తటవర్తి పద్మాలు గతంలో టెన్నిస్‌లో జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఆయన సోదరుడు పాండురంగారావు కుమారుడు విశ్వేశ్వరరావు, సునీత దంపతులు వృత్తిరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వీరి కుమార్తే శ్రేయ. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో శ్రేయ చిన్ననాటి నుంచి టెన్నిస్‌లో రాణిస్తోంది. హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో ప్రస్తుతం బీకాం (ఇంటర్నేషనల్ బిజినెస్) చదువుతున్న శ్రేయ గతంలో చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో జరిగిన ఎంపిక పోటీల్లో ప్రతిభ చూపి ఇటలీలో నిర్వహించిన ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల టెన్నిస్ టోర్నమెంట్‌లో పాల్గొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎంపిక పోటీల్లోనూ రాణించి చైనాలో జరిగే ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల టెన్నిస్ టోర్నీకి భారతదేశం తరఫున ఎంపికైంది. కొవిడ్ వ్యాప్తి అదుపులోకి వచ్చాక నిర్వహించే ఈ టోర్నీ కోసం ఆమె సాధన కొనసాగిస్తోంది. ఆటలో సర్వీస్, ఫోర్‌హ్యాండ్‌తో ఆకట్టుకునే శ్రేయ ఆలిండియా ర్యాంకు 29, ఐటీఎఫ్ ర్యాంకు 1365.
ఒత్తిడిని అధిగమిస్తేనే..
2019 నవంబరులో గాయమైనప్పటికీ మనోధైర్యంతో కోలుకుంది. తరువాత చక్కటి సాధన, కఠోర శ్రమతో లక్ష్యం వైపు అడుగులు వేసింది. ‘క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలి. లక్ష్యం చేరాలంటే పట్టుదల ఉండాలి. ఓటమి ఎదురైనప్పుడు దానికి కారణాలు అన్వేషించి సరిదిద్దుకోవాలి. చేసిన తప్పిదాన్నే మళ్లీ చేస్తున్నామంటే ఒత్తిడికి గురవుతున్నామని అర్థం. దానిని అధిగమిస్తే విజయపథంలో సాగడం ఖాయం’ అని.. భీమవరం ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలపడమే తన లక్ష్యమని శ్రేయ చెబుతోంది.
ఇదీ చదవండి: