Dispute of Temple Lands : తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంపయర్రంపాలెంలో ఆలయ భూములు పరిశీలించిన దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజు... వారం పది రోజుల్లో వేలం నిర్వహించి కౌలుదారులకు... భూములను అందజేస్తామన్నారు. ఈ మాటలు చెప్పి ఇప్పటికి 7నెలలు గడుస్తున్నా భూముల వేలం పాట మాత్రం నిర్వహించలేదని రైతులు వాపోతున్నారు. దేవదాయశాఖకు చెందిన సుమారు 67 ఎకరాల భూమిని కొందరు పెద్దలు తమ గుప్పిట పెట్టుకుని.. రాజకీయ పలుకుబడితో వేలం నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని.. పేదలు ఆరోపిస్తున్నారు. ఈ భూములకు వేలం నిర్వహిస్తే తాము పాట పాడుకుని సాగు చేసుకుంటామని చెప్తున్నారు.
రంపయర్రంపాలేనికి చెందిన మల్లంపల్లి సుందరమ్మ.. 1953లో 89.14 ఎకరాల మెట్ట భూమిని పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారంలోని ఉమా మహేశ్వరస్వామి.. ఆలయానికి దానంగా ఇచ్చినట్లుగా స్థానికులు తెలిపారు. స్వామివారి కళ్యాణం, కార్తీక మాసంలో పూజలు చేయడానికి అలాగే బాటసారుల దాహార్తి తీర్చడానికి, అన్న సంతర్పణకు ఈ భూమి వినియోగించాల్సిందిగా ఆమె కోరారని గ్రామస్తులు చెప్పారు.
ఈ భూమిలో.. 17.14ఎకరాలు కొండ ప్రాంతం ఉండగా.. సూరంపాలెం రిజర్వాయర్ కాల్వలకు 4.35 ఎకరాలను ప్రభుత్వం సేకరించినట్లు తెలుస్తోంది. మిగిలిన 67.65 ఎకరాలను 17 భాగాలుగా విభజించి.. కొందరు కొన్నేళ్లుగా మామిడి, జీడిమామిడి తోటలు సాగు చేస్తున్నారని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం... దేవదాయ భూములకు ప్రతి మూడేళ్లకు ఒకసారి వేలం నిర్వహించాల్సి ఉన్నా... కొన్ని దశాబ్దాలుగా వేలం నిర్వహించడం లేదు. దీంతో అనధికారికంగానే కొందరు రైతులు భూములను సాగు చేసుకుంటున్నారు.
శ్రీమల్లంపల్లి సుందరమ్మ సత్రం భూములకు తక్షణమే బహిరంగ వేలం నిర్వహిస్తే.. దేవదాయశాఖకు ఆదాయంతో పాటు.. ఊళ్లో కూలీలకు ఉపాధి దొరుకుతుందని స్థానికులు చెప్తున్నారు.
శ్రీఉమా మహేశ్వరస్వామి ఆలయ భూములకు 58 ఏళ్ల నుంచి ఇప్పటివరకు వేలం పాట లేదు. ఈ భూమి మీద అగ్రవర్ణాల బతుకుతున్నారు పేదవాళ్లకు కనీస ఫలాలు దక్కడం లేదు. అలాగే ఈ భూములపై ఇచ్చిన ఆదేశాలను రాజకీయ నాయకులు, ఎండోమెంట్ అధికారులు, ఊరు పెద్దలు ఎవరూ పట్టించుకోవడం లేదు. కనుక దీనికి పరిష్కారంగా మా డిమాండ్ ఏంటంటే ఆలయ భూములకు వేలం పాట నిర్వహించాలి.. అది పేదరైతులకు అనుకూలంగా ఉండే విధంగా ఉండాలని కోరుతున్నాం. - శ్రీకాంత్, రంపయర్రంపాలెం
వేలంపాట పెడితే మా ఓపిక తగ్గట్లు పాడుకుంటాం అని కోరుతున్నాం. ఈ విషయం పై కలెక్టర్ వద్దకు వెళ్తే అవుతుంది అంటున్నారు.. అది అవ్వటంలేదు. ఈ ఎండో మెంట్ భూములని వారి సొంత భూములుగా కొందరు పెద్దలు వారి బంధువులకి దానంగా ఇచ్చారు. వేళం పాట నిర్వహించి పేదలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. -ముసలయ్య, రంపయర్రంపాలెం
ఇవీ చదవండి :