TDP Leaders On Young Man Suicide Incident: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పోలీసులు కొట్టారని మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన ఎస్సీ యువకుడి కుటుంబాన్ని తెదేపా నేతలు పరామర్శించారు. తెదేపా నేతుల చిన రాజప్ప, జవహర్, ఆనందరావు బలుసుపేటలోని మృతుడు గిరీశ్ బాబు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
వైకాపా నాయకుల ఒత్తిడితో ఎస్సై అభిమన్యు దారుణంగా ప్రవర్తించి తనను దుర్భాషలాడటంతో పాటు.. తన కుమారుడిని తీవ్రంగా కొట్టి హింసించారని మృతుడి తండ్రి డేవిడ్ రాజు వాపోయాడు. వైకాపా పాలనలో ఎస్సీలను రక్షణ లేకుండా పోయిందని తెదేపా నేతలు ఆక్షేపించారు. ఎస్సీలందరూ ఈ ఘటనను తీవ్రంగా ఖండించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడాలని వారు పిలుపునిచ్చారు.
ఏం జరిగిందంటే..
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని బలుసులపేటకు చెందిన దళిత యువకుడు ఆలపు గిరీష్‌బాబు (24) బుధవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైకాపాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశాడన్న కక్షతో, తప్పుడు కేసు పెట్టించి, పోలీసులతో కొట్టించి తన తమ్ముడి చావుకు కారణమయ్యారంటూ మృతుడి సోదరుడు ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
‘నేను మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాను ఎదుర్కొని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశా. దీంతో వైకాపా నాయకులు మా కుటుంబంపై కోపం పెంచుకున్నారు. దొంగతనం, అత్యాచారయత్నం చేశాడని వాలంటీర్, ఆమె భర్త తప్పుడు ఫిర్యాదు చేస్తే.. అధికార పార్టీ కౌన్సిలర్, ఇతర నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు తప్పుడు కేసు పెట్టారు. ఎస్సై నా తమ్ముణ్ని రోజూ స్టేషన్‌కు పిలిపించి శారీరకంగా, మానసికంగా హింసించారు. దీంతో మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నాడు’ - ప్రవీణ్ కుమార్, మృతుని సోదరుడు
సీఐ, ఎస్ఐపై సస్పెన్షన్ వేటు..
ఘటనకు బాధ్యులను చేస్తూ..పెద్దాపురం సీఐ జయకుమార్, సామర్లకోట ఎస్‌ఐ అభిమన్యును పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు.. ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావుకు నివేదిక సమర్పించటంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి
Ex MP Harsha Kumar: ఆ ఎస్సైని వెంటనే డిస్మిస్ చేయాలి: హర్ష కుమార్