రాష్ట్రంలో ఎస్సీలపై దాడులే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలుగుదేశం ఎస్సీ నాయకులు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎస్సీ యువకుడికి శిరోముండనం చేయడం, ఎస్సీ బాలికపై సామూహిక అత్యాచారం లాంటి ఘటనలు సభ్య సమాజంలో ఎవ్వరూ హర్షించరని అన్నారు. రాజమహేంద్రవరం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని తెదేపా నాయకులు పరామర్శించారు. మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, జవహర్, పీతల సుజాత, తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత, మాజీ ఎమ్మెల్యే ఆనందరావు...బాధితుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి జగన్ ఎస్సీలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరు మార్చుకోకపోతే దేశ వ్యాప్త ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని పీతల సుజాత అన్నారు. సీఎం ఏసీ గదుల్లో పబ్ జీ గేములు ఆడుతూ...ప్రజలతోనూ పబ్ జీ గేములు ఆడుతున్నారని అనిత విమర్శించారు. బాధితులకు తెలుగుదేశం అండగా ఉంటుదని నాయకులు చెప్పారు.