గోదావరికి వరద వచ్చిన ప్రతిసారీ ముంపు ప్రాంతాల ప్రజలకు అవస్థలు తప్పడం లేదని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తెలిపారు. కరోనా వస్తుంది..పోతుంది అన్నట్టే, ఇప్పుడు వరద వస్తుంది..పోతుందన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. అధికారులు, వాలంటీర్లు ప్రజల వద్దకు వెళ్లడం లేదన్న ఆయన... తాగునీటి కొరత, విద్యుత్ లేకపోవడం, పాముల సంచారం వంటి సమస్యలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారన్నారు. ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు ప్రజలకు శాపంగా మారాయని విమర్శించారు.
ముఖ్యమంత్రి ఏరియల్ సర్వేతో సరిపెడితే, అధికారులు ప్రజల వద్దకు వెళ్లకుండా చోద్యం చూస్తున్నారని సూర్యారావు మండిపడ్డారు. తెలుగుదేశం హయాంలో బాధితులను సకాలంలో పునరావాస శిబిరాలకు తరలించి, సౌకర్యాలు కల్పించామని గుర్తు చేశారు. ప్రతి కుటుంబానికి రూ.5 వేలు సాయం చేయాలని డిమాండ్ చేశారు.
జీవీఎల్ అతిగా స్పందిస్తున్నారు
జీవీఎల్ పుట్టకముందే చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నారన్న ఆయన... చంద్రబాబు ప్రధానికి లేఖరాస్తే, జీవీఎల్ ఎందుకు అతిగా స్పందిస్తున్నారని నిలదీశారు. సోము వీర్రాజు పోలవరాన్ని సందర్శించి ఏదేదో మాట్లాడితే, అప్పుడు జీవీఎల్ నోరెత్తలేదే అని సూర్యారావు నిలదీశారు.
ఇదీ చదవండి : దేశ రాజకీయ చిత్రపటంలో ఏపీ రాజధానిగా అమరావతి